ప్రభాత ఉదయం, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎప్పుడు కరువు వచ్చినా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యే నివేదికల సంప్రదాయం మారుతోంది. రాష్ట్రంలో కరువు వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది గ్రామీణ ప్రాంతాలే. ఈసారి, ఎల్ నినో ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తీవ్ర తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధాన జలాశయాలలో నీటి మట్టాలు అమాంతం పడిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలనీల్లో ప్రజలు వాటర్ బోర్డు ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని 16 రెవెన్యూ మండలాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. నగర ప్రాంతంలోనూ కరువు సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిపోర్టును రొపొందించి కేంద్రాన్ని సాయం కోరనుంది. దేశంలోనే తొలిసారిగా ఒక నగర ప్రాంతం కోసం ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
అక్టోబర్‌లోనే ట్యాంకర్ల బుకింగ్
సాధారణ రుతుపవనాలు ముగిసిన వెంటనే నగరంలో నీటి ఎద్దడి ప్రమాదకర స్థాయికి చేరింది. ఏప్రిల్, మే నెలల్లో కనిపించాల్సిన కష్టాలు అక్టోబర్‌లోనే మొదలయ్యాయి. గతంలో అక్టోబర్‌లో వెయ్యి నుంచి 1,500 ట్యాంకర్లు మాత్రమే బుక్ అయ్యేవి. ప్రస్తుతం రోజూ ఎనిమిది వేల వరకు ట్యాంకర్ల బుకింగ్ జరుగుతోంది. గత ఏడాది సగటు భూగర్భ జలాల లోతు 7.52 మీటర్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 11.58 మీటర్లకు పడిపోయింది. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, గచ్చిబౌలి, సైబరాబాద్, బాచుపల్లి, రాజేంద్రనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. బోరు బావులు అడుగంటడంతో చాలామంది అపార్ట్మెంట్లలో అదనపు బోర్లు వేయిస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు డిమాండ్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో వాటర్ ఛార్జీల కోసం ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు.
తగ్గిన వర్షపాతం.
గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 37 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సింగూరు జలాశయంలో నీరు నిలిచిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. వాటర్ బోర్డు అప్రమత్తమై గోదావరి నీటిని మంజీరా ప్రాంతాలకు మళ్లిస్తోంది. ఓఆర్ఆర్ సమీపంలోని వెలిమల వద్ద పైప్‌లైన్ అనుసంధాన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్మాణ రంగాలకు తాగునీటి ట్యాంకర్ల సరఫరాను నిలిపివేశారు. కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే నిర్మాణాలకు వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ, డెవలప్మెంట్ సొసైటీ, భూగర్భ జల వనరుల శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమగ్ర నివేదిక ఆధారంగా నగరంలో తాగునీటి ఉపశమన సాయం కోరనున్నారు.
కేంద్రానికి ప్రత్యేక నివేదిక
మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక నివేదికను రూపొందిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో హైదరాబాద్ జిల్లా పేరు లేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని మండలాలు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా చేర్చి కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. వివిధ శాఖల నుంచి అందిన వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నీటి మట్టాల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ప్రణాళిక విభాగం ఈ రిపోర్టును పూర్తి చేసిన తర్వాత కేంద్రానికి పంపిస్తారు. పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత ఎంత మొత్తం సాయం కోరాలనే అంశంపై స్పష్టత రానుంది.