తెలంగాణ

రామంతాపూర్ పెద్ద చెరువులో హైడ్రా కూల్చివేతలు.. బార్‌ షెడ్‌ నేలమట్టం

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నిర్మాణాలను శనివారం అధికారులు తొలగించారు.

Phaneendra

ప్ర‌భాత ఉద‌యం, ఉప్ప‌ల్‌ : హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న నిర్మాణాలను శనివారం అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో మధురా బార్ అండ్ రెస్టారెంట్‌కు చెందిన భారీ షెడ్‌తో పాటు రేకుల నిర్మాణాలను కూల్చివేశారు.

అనుమతులు లేకుండా రేకుల షెడ్‌లో మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాత్రివేళల్లో మద్యం సేవించిన కొందరు ఖాళీ సీసాలను రోడ్లపై, చెరువులో పడేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు షెడ్‌ను తొలగించారు.

కూల్చివేతల సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్తి యజమానులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి అధికారుల చర్యలను వ్యతిరేకించారు. సుమారు 40 ఏళ్లుగా మున్సిపల్ పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని, ఇన్నేళ్ల తర్వాత నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.

మరోవైపు, ఎఫ్‌టీఎల్‌ హద్దులను ముందుగా స్పష్టంగా నిర్ధారించాలని యజమానులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించామని, యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.