హైదరాబాద్, ప్రభాత ఉదయం: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కేడర్ కేటాయింపుపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) గతంలో ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను ఎత్తివేయాలని ఆమ్రపాలి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం దసరా సెలవుల తర్వాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఆమ్రపాలి తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపించారు.
2024 అక్టోబర్‌లో ఆమ్రపాలిని ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ ఆమె క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్ 2025 జూన్‌లో ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయించాలని ఆదేశించింది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించగా క్యాట్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టేను రద్దు చేయాలని కోరుతూ ఆమ్రపాలి మధ్యంతర దాఖలు చేశారు.
తెలంగాణ కేడర్ కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమ్రపాలి తరఫు న్యాయవాది వాదించారు. 2014 అక్టోబర్ 10నాటి నోటిఫికేషన్లో గతంలో ఇన్సైడర్లుగా గుర్తించిన ఇద్దరు అధికారులను ఔట్సైడర్లుగా చూపించారని తెలిపారు. రాజమండ్రికి చెందిన జే రామానంద్, సికింద్రాబాద్‌కు చెందిన రాణి కుముదుని విషయంలో ఈ మార్పు జరిగిందన్నారు. దీంతో తెలంగాణకు కేటాయించాల్సిన జనరల్ కేటగిరీ ఇన్సైడర్ పోస్టుల సంఖ్య 16 నుంచి 15కు తగ్గిందని వివరించారు. ఈ మార్పు వల్ల రోస్టర్ కేటాయింపుల్లోనూ తేడాలు వచ్చాయని, తెలంగాణకు దక్కాల్సిన ఒక జనరల్ కేటగిరీ ఇన్సైడర్ పోస్టు ఏపీకి అదనంగా కేటాయించారని వాదించారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 80 ప్రకారం సముచిత పంపిణీ జరగాల్సి ఉందని, క్యాట్ ఇచ్చిన ఉపశమనాన్ని కొనసాగించాలని కోరారు. 2014 అక్టోబర్ 10న జరిగిన ఇన్సైడర్–ఔట్‌సైడర్ కేటాయింపు ప్రక్రియను ప్రస్తుత పిటిషన్లో నేరుగా సవాల్ చేయలేదని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియకు, ప్రస్తుతం సవాల్ చేస్తున్న క్యాట్ ఉత్తర్వులకు సంబంధం లేదని వాదించారు. క్యాట్ ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి కేడర్ కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.