తెలంగాణ

270 నుంచి 251కు.. ఐఐటీ హైదరాబాద్ ర్యాంక్ మెరుగుదల

ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ 19 స్థానాలు మెరుగుపరుచుకుంది. గతేడాది 270వ స్థానంలో ఉండగా.. తాజాగా 251వ ర్యాంకును సాధించింది. పరిశోధన, అధ్యాపకుల పనితీరు ఈ పురోగతికి దోహదపడ్డాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, సంగారెడ్డి : ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గతేడాది 270వ స్థానంలో ఉన్న ఈ విద్యాసంస్థ తాజాగా 19 స్థానాలు ఎగబాకి 251వ ర్యాంకును సాధించింది. పరిశోధన ఉత్పాదకత, అధ్యాపకుల విద్యార్హతల విషయంలో మెరుగైన పనితీరు కనబరిచి ఈ పురోగతిని సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం ఐఐటీ క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ విజయం అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది నిరంతర కృషికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపేలా సాంకేతికత, డీప్‌టెక్ ఆవిష్కరణలను అనుసంధానించే వాతావరణాన్ని ఐఐటీ హైదరాబాద్‌లో నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నత లక్ష్యాలతో వినూత్న ఆలోచనలు అభివృద్ధి చేసి, వాటిని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మలిచేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.