తెలంగాణ

అర్ధరాత్రి రేసింగ్.. నో పోలీసింగ్!

భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద కారు ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు మృతి చెందగా, వారి కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Ranjith

ప్రభాత ఉదయం, మహబూబ్ నగర్:  అర్ధరాత్రి దాటితే పాలమూరు-పాలకొండ బైపాస్ రహదారి స్పోర్ట్స్‌ బైక్లు, కార్ల రేసింగ్‌తో హోరెత్తుతోంది. హైదరాబాద్ నుంచి వస్తున్న యువకులు ఈ రహదారిని రేసింగ్ ట్రాక్‌గా మార్చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో పలువురి ప్రాణాలు పోయినా అడ్డుకట్టపడటం లేదు. పోలీసులు దీన్ని కట్టడిచేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ఈ రేసింగ్ గ్యాంగ్ సభ్యులు సంబంధిత ఠాణాల్లో భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పడంతో పోలీసులు అటుగా కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. ఓల్డ్ సిటీ నుంచి వస్తున్న యువత బడా నాయకుల సంబంధీకులు అవడంతో చర్యలకు వెనుకాడుతున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. 

మూడు కుటుంబాల్లో విషాదం

నాలుగు నెలల క్రితం అర్ధరాత్రి బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు కారును ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు, కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.  ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘటనా సమయంలో హడావుడి చేసిన పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారే తప్ప రేసింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దంపతులను బలితీసుకున్న కార్ రేసింగ్

శుక్రవారం అర్ధరాత్రి పాలమూరు సమీపంలోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద  కొందరు యువకులు కారు రేసింగ్‌ చేస్తూ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు.  ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందగా.. కూతురు ఆయారా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద కారకులు కారు అక్కడే వదిలి పరాయ్యారు.