In makthal due to shortage of workers cotton farmers are bringing laborers from Karnataka and Rayalaseema region 
తెలంగాణ

పత్తి ఏరివేతకు ‘పొరుగే’ దిక్కు!

మక్తల్‌ నియోజకవర్గంలో 1,18,584 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, కూలీల కొరతతో రైతులు కర్ణాటక, రాయలసీమ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు.

Saidi Reddy
రాయలసీమ నుంచి వలస వచ్చిన కూలీలు వేసుకున్న గుడిసెలు

ప్రభాత ఉదయం, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 1,18,584 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. అయితే, పత్తి సేకరణకు స్థానికంగా కూలీలు సరిపడా దొరక్కపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో కూలీలకు మరింత డిమాండ్​ పెరిగింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తున్నది. కర్ణాటక రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ నుంచి రవాణా చార్జీలు భరించి కూలీలను తీసుకురావాల్సి వస్తున్నది. వారు పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండేందుకు తాత్కాలిక ఆవాసాలు సైతం ఏర్పాటుచేసి వసతి కల్పించాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు.   

స్థానిక కూలీలకు డిమాండ్.. ​ 

‘స్థానిక కూలీలు మొదటి విడత పత్తి సేకరణకు క్వింటాల్​కు రూ.వెయ్యి తీసుకుంటారు. ఇక రెండో విడతకు మరింత పెంచుతారు. అదే వలస కూలీలైతే  మొదటి నుంచి చివరి వరకు ఒకే ధర తీసుకుంటారు. కిలోకు రూ.పది చొప్పున మొదటే ఒప్పందం చేసుకుంటారు. పత్తిని  ఇంటికి చేర్చడం, నిల్వ చేయడం  వారే చేస్తారు. కూలీలను మాత్రం ఆవాసాల నుంచి  పొలానికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావాల్సి ఉంటుంది’ అని రైతులు పేర్కొంటున్నారు. 

రూ.42 వేల ఖర్చు వచ్చింది

‘తాను 20 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పత్తి సేకరణకు కర్ణాటక నుంచి కూలీలను తీసుకొచ్చాను. మొదటి విడతలో 60 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. కూలీలు వచ్చిపోయేందుకు రవాణాచార్జీలు 42వేల ఖర్చు వచ్చింది’ అని కృష్ణ మండలం, చేగుంట రైతు సిద్ధప్ప తెలిపారు. 

మక్తల్​ నియోజకవర్గంలో పత్తి సాగు వివరాలు(ఎకరాల్లో)   

 మక్తల్​                 30 వేలు

ఉట్కూర్​              42 వేలు

కృష్ణ                   18,600

నర్వ                   17,584

మాగనూర్            10,400

మొత్తం               1,18,584