ప్రభాత ఉదయం, సంగారెడ్డి : పత్తి చేనులో దొంగలు పడ్డారు. ఏకంగా చేనులో పత్తి చెట్లపై కోతకు సిద్ధంగా ఉన్న 10 క్వింటాళ్ల పత్తి ఎత్తుకెళ్లారు. అసలే కరువు పరిస్థితులు ఆపై వ్యయప్రయాసలతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దొంగలు రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లడంతో బాధిత రైతు దుఃఖంలో మునిగిపోయాడు. కరువు పరిస్థితుల్లో దొంగలు పంట చేనులను కూడా వదలని తీరు రైతాంగాన్ని కలవరపెడుతోంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మద్దికుంట గ్రామానికి చెందిన రైతు బ్రహ్మానందరెడ్డి తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమి సహా కౌలు భూమి ఐదెకరాలలో పత్తి పంట సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పండించిన పంట చేతికి రావడంతో కోత పనులకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఈ నెల 29న అర్ధరాత్రి దొంగలు ఆయన పత్తి చేనులో చొరబడి దాదాపు 10 క్వింటాళ్ల పత్తిని పూర్తిగా తెంపుకొని ఎత్తుకెళ్లారు.
మరుసటి రోజు ఉదయం చేను వద్దకు వెళ్లిన బ్రహ్మానందరెడ్డి దంపతులు పత్తి చెట్లకు పత్తి లేకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దొంగలు పత్తి పంట చోరీ చేశారని గ్రహించి కన్నీరు మున్నీరయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన దొంగిలించిన పత్తి విలువ దాదాపు రూ.90 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకుని ఆర్థికంగా కొంత ఊరట పొందాలనుకున్న రైతు కుటుంబానికి ఈ ఘటన ఆర్థికంగా నష్టాన్ని మిగిల్చింది. పెట్టుబడి సైతం తిరిగిరాని పరిస్థితి నెలకొంది. పత్తి చోరీ ఘటనపై రైతు బ్రహ్మానందరెడ్డి సదాశివపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.