ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి, ఆయన భార్యకు చెందిన బినామీ ఆస్తుల వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ చర్యలు చేపట్టింది. బీనామీ యాక్ట్ ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అధికారిక ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా ఆస్తులు పొందినట్లు గుర్తించి రెండు ఇళ్లు, వ్యవసాయ భూములు, ఒక కారును తాత్కాలికంగా జప్తు చేసింది. వాటి విలువ రూ.59.4 లక్షలని, ప్రస్తుతం మార్కెట్‌తో పోలిస్తే ధర భారీగా ఉంటుందని వెల్లడించింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు నవంబర్ 3న నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. పటాన్చెరు పరిధిలోని ముత్తంగిలో రెండు ఇళ్లు, మొగుడంపల్లిలో 3.20 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వ్యవసాయ భూములు, టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఈ జాబితాలో ఉన్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బీనామీ యాక్ట్ కింద సెప్టెంబర్ 30న 8 మంది బీనామీలపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 జులైలో ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్‌లో రెండు ఇళ్లను భీమ్‌రెడ్డి బీనామీ పోతుగంటి ఇంద్రకరణ్‌రెడ్డి పేరిట బదిలీ చేసినట్లు గుర్తించింది. రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఒక్కోదాని విలువ రూ.14.2 లక్షలుగా పేర్కొంది. పటాన్చెరువు సబ్ డివిజనల్ పోలీసు అధికారిగా పనిచేసిన సమయంలో భీమ్‌రెడ్డి నుంచి ప్రతిఫలం పొందిన వారు ఇళ్లు ఇచ్చారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. మొగుడంపల్లిలోని నాలుగు వ్యవసాయ భూములను హోంగార్డు లక్ష్మణ్ నాయక్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించింది. వీటి విలువను పత్రాల్లో రూ.8.9 లక్షలుగా వెల్లడించింది. ఆయన వినియోగిస్తున్న కారు కూడా ఆక్రమ మార్గంలో వచ్చిందని, విలువ రూ.22 లక్షలుగా ఐటీ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మిగిలిన బీనామీ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని వెల్లడించింది.