ప్రభాత ఉదయం, ఉట్నూర్ : ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రంభీం కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుమ్రంభీం మనవడు కుమ్రం సోనేరావు, మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఎంపీ నగేశ్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాపురావు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. అమరవీరుల స్తూపం వద్ద డోలు, తుడుం, కలికోం, పెప్రే వాయిద్యాల నినాదాలు, డీజే పాటల మధ్య భారీ ర్యాలీగా విగ్రహం వద్దకు చేరుకున్నారు. అడవి, భూమి, నీటిపై ఆదివాసీల హక్కుల కోసం కుమ్రంభీం చేసిన పోరాటాన్ని, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించి అర్హులైన ఆదివాసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి గోడం గణేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపురావు, విగ్రహావిష్కరణ నిర్వహణ కమిటీ చైర్మన్ మెస్రం నాగ్నాథ్తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.