మల్లన్నసాగర్ సమీపంలో నూతన పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న అధికారులు 
తెలంగాణ

‘మల్లన్నసాగర్’కు ఎలాంటి ముప్పు లేదు

మల్లన్నసాగర్ డ్యామ్‌కు నూతన పంప్‌హౌస్ నిర్మాణంతో ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల, జలమండలి అధికారులు స్పష్టం చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, సిద్దిపేట : నూతన పంప్​ హౌస్​ నిర్మాణంతో మల్లన్నసాగర్​ ప్రాజెక్ట్​కు ఎటువంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ చీఫ్​ ఇంజినీర్​ శివధర్మతేజ్​, జలమండలి ప్రాజెక్ట్​ డైరెక్టర్​ బి.మహేశ్​ కుమార్​ స్పష్టం చేశారు. శనివారం వారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం శివారులో చేపడుతున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం నూతన పంప్​హౌస్​ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  మల్లన్నసాగర్ డ్యామ్‌కు సుమారు 293 మీటర్ల దూరంలో ప్రభుత్వ అనుమతులతో పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో భాగంగా గతంలో నియంత్రిత పేలుళ్లు మాత్రమే చేపట్టినట్లు వివరించారు.  నిర్మాణ ప్రాంతంలో ఎదురైన భారీ బండరాయిని పేలుళ్ల ద్వారా కాకుండా, ప్రత్యేక రసాయన పద్ధతుల్లో ఎలాంటి కుదుపులు, ప్రకంపనలు తలెత్తకుండా తొలగిస్తామని చెప్పారు. పంప్‌రూమ్ నిర్మాణ స్థలాన్ని సుమారు 100 మీటర్ల మేర పక్కకు మార్చి పనులు చేపడుతున్నామని వివరించారు. మల్లన్నసాగర్ డ్యామ్‌తో పాటు పంప్‌హౌస్ నిర్మాణ ప్రాంతంలో రిజర్వాయర్ వైపు ఎలాంటి నీటి లీకేజీలు గుర్తించలేదని స్పష్టం చేశారు. డ్యామ్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగు జాగ్రత్తలతో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వివరించారు.