ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఆన్లైన్ తరగతుల్లో పిల్లలను ఆకట్టుకునేందుకు చూపించే కదిలే బొమ్మలు, వేగవంతమైన విజువల్స్ వారి దృష్టిని కట్టిపడేస్తున్నాయి. అయితే, అంతగా ఆకర్షితులవుతున్నంత మాత్రాన పిల్లలు పాఠాలను మెరుగ్గా నేర్చుకుంటున్నారని భావించలేమని పరిశోధకులు చెబుతున్నారు. వీడియోల్లోని కదలికలు పిల్లల దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ.. బోధనాంశాలపై వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అమెరికాలోని శాంటా క్లారా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిస్థితిని వారు ‘అటెన్షన్ ట్రాప్’గా అభివర్ణించారు. కంప్యూటర్ తెరపై బోధనా వీడియోలు చూస్తున్న పిల్లల ప్రవర్తనపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై ఈ పరిశోధన నిర్వహించారు.
ఈ పరిశోధన కోసం యూట్యూబ్‌లో పిల్లల కోసం రూపొందించిన 32 వేల వీడియోలను పరిశీలించారు. వాటిని చూస్తున్న 6 నుంచి 10 ఏళ్ల పిల్లల కంటి కదలికలను విశ్లేషించారు. వీడియోల్లో చిత్రాల కదలికలు 10 శాతం ఉంటే.. పిల్లల కళ్ల కదలికలు మాత్రం కేవలం ఒక శాతానికే పరిమితమవుతున్నట్లు గుర్తించారు. అంటే తెరపై వేగంగా మారుతున్న దృశ్యాలు పిల్లల చూపును ఆకర్షిస్తున్నా.. వాటికి అనుగుణంగా వారి దృష్టి, అభ్యసన ప్రక్రియ సాగడం లేదని పరిశోధకులు గుర్తించారు.
వీడియోల్లోని వేగవంతమైన కదలికలు పిల్లలను తెరకు అతుక్కుపోయేలా చేస్తున్నప్పటికీ.. అదే స్థాయిలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడం లేదని అధ్యయనం సూచించింది. ఐఎస్బీకి చెందిన సుమీత్ కుమార్, మధు విశ్వనాథన్, శాంటా క్లారా యూనివర్సిటీకి చెందిన రవి బాప్నా ఈ పరిశోధనను ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రీసెర్చ్’లో ప్రచురించారు.
స్క్రీన్‌పై కనిపించే ఆకర్షణీయమైన విజువల్స్ పిల్లల చూపును కట్టిపడేస్తున్నాయి. అయితే, వారు వీడియోను ఆసక్తిగా చూస్తున్నంత మాత్రాన అందులోని పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటున్నారని భావించకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లోనే కాకుండా ఇళ్లలోనూ వీడియోల ద్వారా బోధన పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘ఎక్కువ నిమగ్నమై చూస్తున్నారంటే.. మెరుగ్గా నేర్చుకుంటున్నారని అనుకోకూడదు’’ అని ఐఎస్బీకి చెందిన మధు విశ్వనాథన్ పేర్కొన్నారు. పిల్లలు చదువు కోసం ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నారనే దానికే పరిమితం కాకుండా.. ఆ సమయంలో ఎంతవరకు నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచిస్తున్నారు. వీడియో కంటెంట్ రూపకర్తలు కేవలం పిల్లలను ఆకర్షించే అంశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. అభ్యసనానికి దోహదపడేలా వీడియోలను రూపొందించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.