అక్రమ దందాలో చివరకు ఫుట్‌పాత్‌లు కూడా ఆదాయ మార్గాలుగా మారిపోయాయి. రోడ్లకు ఇరువైపులా పాదచారుల కోసం ఏర్పాటుచేసిన ఫుట్‌పాత్(వాకింగ్ ప్లాట్ ఫామ్)లను సైతం వ్యాపారులు అద్దెకు ఇస్తూ వేల నుండి లక్షల్లో వసూలు చేస్తున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపుల షాప్‌ల ముందు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు వ్యాపారులకు వరంగా మారాయి. తమ షాప్‌ల ముందున్న ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చుకుంటూ అదనపు ఆదాయం పొందుతున్నారు. వారి సొంత స్థలం మాదిరిగా ఫుట్‌పాత్‌లను అద్దెకు ఇచ్చుకుంటున్న వ్యాపారుల అక్రమ దందాపై మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ఫుట్‌పాత్‌లపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన చిరు దుకాణాల ఏర్పాటు కారణంగా, ప్రజలు రోడ్ల పక్క నుండి నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురి కావడంతో ప్రధాన రోడ్లపైనే నడిచి వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు.
లక్షల్లో అక్రమార్జన..మున్సిపల్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర
ఓ వైపు వ్యాపారులు మరో వైపు దళారులు ఫుట్ పాత్లను తమ సొంత స్థలం మాదిరిగా ఆక్రమించుకొని అద్దెలకు ఇస్తున్నారు. ప్రధాన రహదారి వెంట ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్లపై అక్కడక్కడ కొందరు దళారులు కర్చీఫ్ వేసినట్లుగా కబ్జాలు చేసి, ఈ స్థలం నాదేనని యథేచ్చగా అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలోని ఓ రాజకీయ నాయకుడు ఖాళీగా ఉన్న తన స్థలం ముందు ఫుట్‌పాత్‌ను కొందరికి తాత్కాలిక వ్యాపారం చేసుకోవడానికి రూ. 1.60 లక్షలకు అద్దెకు ఇచ్చాడు. మరోచోట దళారులు రూ. 30 వేల నుండి రూ. 50 వేలకు అద్దెలకు ఇచ్చారు. ఫుట్‌పాత్‌ల అక్రమ అద్దెల విషయమై సదరు వార్డు కౌన్సిలర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పైగా మున్సిపాలిటీకి చెందిన గుత్తేదారుడు ఫుట్‌పాత్ చిరు వ్యాపారుల వద్ద నుంచి చిట్టీల దందా కూడా చేస్తుండటం ఈ వ్యవహారంలో కొసమెరుపు.