ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఎల్ నినో ప్రభావానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ బహిరంగ లేఖ రాశారు. ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు నేపథ్యంలో వ్యవసాయ రంగం, ప్రజల జీవనాధారం తీవ్ర సంక్షోభంలో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 03 ప్రకారం రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాలను (111 తీవ్ర కరువు, 254 పాక్షిక కరువు) అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కరువు ప్రభావం ఉందని పేర్కొన్నారు. పట్టణాల ప్రజలపై కూడా ప్రభావం ఉన్నందున తక్షణమే రాష్ట్రంలోని మొత్తం మండలాలను, పట్టణాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి కీలక ప్రాజెక్టులలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయని వెస్లీ గుర్తు చేశారు. భూగర్భ జలాలు ఇంకిపోతుండటంతో సాగునీరు, తాగునీరు , విద్యుత్ ఉత్పత్తికి ప్రమాదం ఏర్పడుతోందని లేఖలో వివరించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతరమవుతున్నదని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పంట నష్టాలను అంచనా వేసి వాణిజ్య పంటలకు ఎకరాకు రు.50వేలు, ఇతర పంటలకు రు.30వేలు రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు నివారణ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని కోరారు.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కేజీ రూ.100 వరకు పెరిగిపోవడం ప్రజలకు భారంగా మారిందని వెస్లీ పేర్కొన్నారు. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తెల్లరేషన్ కార్డుదారులందరికీ 15 రకాల సరుకులను ఉచితంగా అందించాలని కోరారు. కరువును ఎదుర్కొనేందుకు కేంద్రం నుండి రూ. 50,000 కోట్ల ప్రత్యేక సహాయం సాధించడానికి అఖిలపక్ష బృందాన్ని రాష్ట్రప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే కరువు ప్యాకేజీని ప్రకటించి విడుదల చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నదని జాన్ వెస్లీ లేఖలో తెలిపారు.