ప్రభాత ఉదయం, కొల్లాపూర్:
ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి, కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, వారికి కొత్త వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమానికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మహిళలు, రైతులు, పేద కుటుంబాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యం, పెద్దకొత్తపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.