ప్రభాత ఉదయం, చొప్పదండి: రెండు రాష్ట్రాలను అనుసంధానించే కరీంనగర్ -రాయపట్నం రహదారి దారుణంగా మారింది. తెలంగాణ- మహారాష్ట్ర మధ్య ఎంతో కీలకమైన ఈ రాష్ట్ర రహదారిపై ప్రయాణం చేయాలంటే నరకయాతన పడాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతోంది. కొన్ని దుర్ఘటనల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
2000 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాయపట్నం నుంచి కోదాడ వరకు 180 కిలోమీటర్ల మార్గాన్ని స్టేట్ హైవేగా అభివృద్ధి చేసింది. అప్పుటి నుంచి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండేది. ఈ స్టేట్ హైవే రాజీవ్ రహదారిగా అభివృద్ధి చెందడంతో కొంత ప్రాధాన్యం తగ్గింది. 2014లో గోదావరి పుష్కరాల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత మేర మరమ్మతులు చేపట్టింది. తరువాత ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదు.
తస్మాత్ జాగ్రత్త
చొప్పదండి, కొలిమికుంట, రుక్మాపూర్, నగునూర్, మల్లాపూర్, కమ్మరఖాన్ పేట, కటికెనపెల్లి వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది నగునూర్ పీఎంఆర్ స్కూల్ వద్ద జరిగిన ప్రమాదంలో చొప్పదండికి చెందిన రమేశ్ దుర్మరణం చెందాడు. రైతు వేదిక సమీపంలో బైక్ పై వెళ్తున్న పెద్దాపూర్‌కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మల్లాపూర్ వద్ద ఆటో గుంతలో పడి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. కొలిమికుంట సమీపాన కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు మరణించారు.
‘‘ప్రతి రోజు ఏదో ఒక చోట గుంతలను తప్పించబోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది చనిపోయారు. ప్రజాప్రతినిధులు స్పందించి నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయాలి.’’ అని రుక్మాపూర్ గ్రామానికి చెందిన పోగు రమేశ్ కోరుతున్నారు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
కరీంనగర్-రాయపట్నం రాష్ట్ర రహదారి కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల్లో విస్తరించి ఉండడంతో ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. మేము ప్రతి రోజూ కరీంనగర్, ధర్మారం, వెల్గటూర్ వరకు ప్రయాణికులను ఆటోలో తీసుకెళ్తాము. ఆటోలు దెబ్బతినడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలి.’’ అని చొప్పదండి ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలూరి ప్రసాద్ డిమాండ్ చేశారు.