ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చినా, ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దొంగలు పడిన ఆరు నెలలకు అన్నట్టుగా, ఇప్పుడొచ్చి రైతులు త్యాగాలు చేయాలని సీఎం నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు. పాలకుడికి దూరదృష్టి ఉండాలని, పరిస్థితి చేయి దాటిన తర్వాత రేవంత్ మాయమాటలు చెప్పడం దారుణమని కవిత మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆగస్టులో 28 శాతం లోటు వర్షపాతం నమోదైందని, అప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.
నింపాదిగా సీఎం రివ్యూలు
పక్క రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపాయని కవిత గుర్తు చేశారు. తెలంగాణ సీఎం మాత్రం నింపాదిగా రివ్యూలు అంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుపై అఖిలపక్ష సమావేశం పెడతామని సీఎం అంటున్నారని, ఈ పనిని ముందే ఎందుకు చేయలేదన్నారు. బీసీ బిల్లుపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని ఆమె నిలదీశారు. కరువు విషయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని కవులు, కళాకారులు, ప్రతిపక్షాలు, సినిమా స్టార్లను రేవంత్ కోరుతున్నారని, గతంలో వారిని ఇబ్బంది పెట్టిన విషయాన్ని మర్చిపోయారా అని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ తప్పులనే రేవంత్ చేస్తున్నారు
‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అయ్యింది. ఇప్పటిదాకా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయలేదు. వాటిని పూర్తిచేసి ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేదా?” అని కవిత ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి కనీసం భీమా, నెట్టంపాడు ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకపోవటం అన్యాయమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని, ఇంకా ఎన్నాళ్లు గత ప్రభుత్వాన్ని తిడుతూ సమయం వృథా చేస్తారని ఆమె ప్రశ్నించారు. తిట్టుడు బంద్ చేసి కట్టుడు షురూ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదికి కృష్ణా జలాల ఒప్పందాన్ని కుదుర్చుకుంటే, ఆ వంకతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీకి కృష్ణా జలాలను రేవంత్ ధారాదత్తం చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడవే తప్పులు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
కుటుంబానికి సంపద దోచిపెట్టే పనిలో సీఎం
‘‘రాష్ట్రం సంక్షోభంలో ఉంటే సీఎం తన కుటుంబానికి సంపదను దోచిపెట్టే పనిలో ఉన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కొన్ని కాంపొనెంట్లను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. పవర్ మ్యాక్స్ అనే కంపెనీతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 వేల చెరువులను మాయం చేశారు. దీంతో హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులను కాపాడాల్సిన హైడ్రా ఏం చేస్తోంది ?”అని కవిత పేర్కొన్నారు.
నమ్మినోళ్లను నట్టేట ముంచిన కేటీఆర్
విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్‌రావుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాయడంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో బీఆర్ఎస్కు అండగా నిలిచిన శ్రీనివాస్ రావుపై విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమే అవుతుందన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం, ఇంటి మనిషినైన తనను కిరాయి మనుషులతో తిట్టించడం కేటీఆర్ నైజమని ఆమె మండిపడ్డారు. సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే వ్యక్తి కేటీఆర్ అని ధ్వజమెత్తారు. సింగరేణి సభలో కేటీఆర్ కార్మికుల సమస్యల కంటే రాజకీయాలే ఎక్కువగా మాట్లాడారని విమర్శించారు. అది కార్మిక గర్జన కాదని, కేటీఆర్ గర్జన అని ఎద్దేవా చేశారు. కార్మికుల కోసం పనిచేస్తున్న హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కూటమే సింగరేణి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.