Kavitha demands the implementation of 75% reservation for STs in constable jobs within Agency areas 
తెలంగాణ

ఎస్టీలకు అన్యాయం చేయొద్దు

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లు లేవని కవిత విమర్శించారు. దీనివల్ల గిరిజన యువత నష్టపోతారని పేర్కొన్నారు.

Aravind Reddy

హైదరాబాద్, ప్రభాత ఉదయం: ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు అన్యాయం చేయొద్దని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కోరారు. వారికి న్యాయంగా దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లను విస్మరించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1988లో జారీ చేసిన జీవో109, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ 49 ప్రకారం ఏజెన్సీ ఏరియా కానిస్టేబుల్ పోస్టుల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని గుర్తు చేశారు. 2015, 2018, 2022 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేశారన్నారు. కానీ ఈ ఏడాది పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లను విస్మరించారని మండిపడ్డారు.

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్‌‌కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఆదివాసీ, గిరిజన యువత తీవ్రంగా నష్టపోతారని కవిత పేర్కొన్నారు.  దాదాపు 400ల కానిస్టేబుల్ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు.