తెలంగాణ

ఉమ్మడి ఏపీ పొలిటికల్ థ్రిల్లర్..చరిత్ర గతిని మార్చిన సంచలన ఘట్టాలు

Agasthya kantu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర అంటే కేవలం ఎన్నికలు, ప్రభుత్వాలు మారిన కథ కాదు.. రాజ్యాంగ సంక్షోభాలు, ప్రాంతీయ అసంతృప్తులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, ఊహించని రాజకీయ మలుపులు, సంచలన నిర్ణయాలు, అధికార పోరాటాలు, విషాద ఘటనలు రాష్ట్ర రాజకీయ గమనాన్ని ఎప్పటికప్పుడు మార్చేశాయి. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు.. ప్రతి మలుపూ, నిర్ణయం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాల నిర్ణయాలను ఎలా ప్రభావితం చేశాయి? ప్రాంతీయ రాజకీయాలు ఎలా బలపడ్డాయి? కీలక వ్యక్తుల నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను శాశ్వతంగా ప్రభావితం చేసిన అలాంటి కీలక ఘట్టాలేంటో చూద్దాం..

1969 జై తెలంగాణ ఉద్యమం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలకు, ప్రాంతీయ ఆకాంక్షలకు తొలిసారిగా పెద్ద ఎత్తున వేదికైన ఘట్టం 1969 నాటి జై తెలంగాణ ఉద్యమం. ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుందని 1969 జనవరి 8న ఖమ్మం పట్టణంలో విద్యార్థి అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ చేపట్టిన దీక్ష క్రమంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన భారీ ప్రజా ఉద్యమంగా మారింది.  పెద్దమనుషుల ఒప్పందంలోని ముల్కీ నిబంధనలు,  ఉపాధి రక్షణలు అమలు కావట్లేదనే ఆగ్రహంతో విద్యార్థులు, ఉద్యోగులు ఉమ్మడిగా పోరాటానికి దిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ప్రారంభమైన ఈ ఉద్యమం స్వల్ప కాలంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, కార్మికులు,  సామాన్య ప్రజల మద్దతుతో తీవ్ర రూపం దాల్చింది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా, పోలీసు కాల్పుల్లో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో 'తెలంగాణ ప్రజా సమితి' (TPS) ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో TPS అత్యధిక స్థానాలు గెలుచుకుని తన సత్తా చాటినప్పటికీ, తదనంతర రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్‌లో విలీనమవడంతో మలిదశ వరకు ఆ ఆకాంక్ష సుప్తావస్థకు చేరుకుంది.

1972 జై ఆంధ్రా ఉద్యమం

తెలంగాణ ఉద్యమానికి ప్రతిరూపంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎగిసిపడిన చారిత్రాత్మక ఉద్యమం 'జై ఆంధ్రా'. హైదరాబాద్‌తో కలిపి ఉన్న ముల్కీ నిబంధనలు (స్థానిక ఉద్యోగ నిబంధనలు) చెల్లుబాటు అవుతాయని 1972 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆంధ్ర ప్రాంత ప్రజలలో, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆంధ్ర ప్రాంత వాసులకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సమాన హక్కులు, ఉద్యోగాలు లభించడం లేదని ఆరోపిస్తూ ఆంధ్ర ప్రాంత నాయకులు, విద్యార్థులు ప్రత్యేక 'ఆంధ్ర రాష్ట్రం' కావాలంటూ రోడ్లపైకి వచ్చారు. నాటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు ఈ ఉద్యమ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, కాంగ్రెస్ పార్టీలోని ఆంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడటంతో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి, పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది.

ఆరు సూత్రాల పథకం (Six-Point Formula )

జై తెలంగాణ, జై ఆంధ్రా ఉద్యమాలతో రెండు ప్రాంతాల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగపరమైన పరిష్కారమే 'ఆరు సూత్రాల పథకం'. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో 1973 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు.  ప్రాంతీయ అభివృద్ధి, విద్యా అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం, పరిపాలనా వ్యవస్థలో ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-D, 371-E ద్వారా ఉద్యోగాలు, విద్యలో ప్రాంతీయ ప్రాధాన్యానికి రాజ్యాంగపరమైన వ్యవస్థ ఏర్పడింది. దీంతో అప్పటి ముల్కీ నిబంధనలకు ప్రత్యామ్నాయంగా కొత్త ప్రాంతీయ సమతుల్యత విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది ప్రాంతీయ సమస్యలకు తాత్కాలిక పరిష్కారం చూపినా.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను పూర్తిగా ముగించలేకపోయింది.

1982 ఎన్టీఆర్ పార్టీ స్థాపన  9 నెలల్లో విప్లవాత్మక విజయం!

తెలుగు రాజకీయ చరిత్రను, ఐదు పదుల కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టేసిన చారిత్రాత్మక ఘట్టం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రాజకీయ రంగప్రవేశం. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పదేపదే ముఖ్యమంత్రులను మారుస్తూ 'తెలుగువారి ఆత్మగౌరవాన్ని' దెబ్బతీస్తోందనే నినాదంతో, ఎన్టీఆర్ 1982 మార్చి 29న 'తెలుగుదేశం పార్టీ' (TDP) ని స్థాపించారు. 'చైతన్య రథం'పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లో అపూర్వ చైతన్యాన్ని రగిలించాయి. రూ. 2లకే కిలో బియ్యం, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఆకర్షణీయమైన సంక్షేమ హామీలతో ప్రజామోదం పొందిన ఎన్టీఆర్, పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే (1983 జనవరి ఎన్నికలు) కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టి ప్రచండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన 9 నెలల స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక అరుదైన రికార్డు.

1984 ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో గవర్నర్‌–ముఖ్యమంత్రి వివాదానికి అత్యంత సంచలన ఉదాహరణ 1984 ఆగస్టు సంక్షోభం. 1983లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో గవర్నర్ గా ఠాకూర్‌ రామ్‌లాల్‌ ఉన్నారు. 1984లో ఎన్టీఆర్‌ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే, తనకు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే నాటి గవర్నర్ ఠాకూర్ రామ్‌లాల్, ఎన్టీఆర్ బలపరీక్ష నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. 1984, ఆగస్ట్ 16న మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, "ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి" దారితీసింది. ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వీధుల్లో, రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ నిర్వహించారు. ప్రజా ఒత్తిడి మరియు దేశవ్యాప్త రాజకీయ నిరసనల కారణంగా  రామ్‌లాల్‌ 1984 ఆగస్ట్ 24న రాజీనామా చేశారు. కేంద్రం గవర్నర్ రామ్‌లాల్‌ను స్థానంలో 1989, ఆగస్ట్ 29న శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించింది. శంకర్ దయాళ్ శర్మ అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించగా నాదెండ్ల భాస్కరరావుకు మెజారిటీ లేకపోవడంతో ఆయన సెప్టెంబర్ 16న సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984, సెప్టెంబర్ 16 తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

1995 తెదేపా నాయకత్వ మార్పు (వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్)

తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు పరాకాష్టకు చేరి, రాష్ట్ర రాజకీయాల్లో మరో నూతన శకానికి నాంది పలికిన ఘట్టం 1995 ఆగస్ట్ ఎపిసోడ్. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ మళ్లీ భారీ విజయంతో అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి జోక్యం ప్రభుత్వంలో, పార్టీలో పెరిగిపోతోందనే అసంతృప్తి టీడీపీ నాయకుల్లో తీవ్రస్థాయికి చేరింది. దీనితో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరుకుని ఎన్టీఆర్‌పై బహిరంగ తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య నాటి సీఎం ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ కృష్ణకాంత్‌కు సిఫార్సు చేసినప్పటికీ, గవర్నర్ ఆ సిఫార్సును పక్కనబెట్టి అసెంబ్లీలోనే ఎవరికి మెజారిటీ ఉందో తేల్చుకోవడానికి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు శాసనసభ వేదికగా తన మెజారిటీని నిరూపించుకోవడంతో 1995, సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

2000.. బషీర్‌బాగ్‌ కాల్పులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడం తీవ్ర ప్రజాందోళనలకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2000 ఆగస్టు 28న 'చలో అసెంబ్లీ' పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ వద్ద వేలాదిగా తరలివచ్చిన నిరసనకారులను అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని, పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వామపక్ష నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తర్వాతి కాలంలో చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల్లో, గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి,  వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రకు విశేష ప్రజాదరణ లభించడానికి ఈ ఘటన ఒక ప్రధాన రాజకీయ మైలురాయిగా నిలిచింది.

కేసీఆర్ రాజీనామా - తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావం

సుదీర్ఘ కాలం పాటు సుప్తచేతనావస్థలో ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మళ్లీ రాజకీయ వేదికపై పునరుద్ధరించిన చారిత్రక పరిణామం ఇది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్‌గా, సీనియర్ నాయకుడిగా ఉన్న కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు మరియు నీళ్లు, నిధులు, నియామకాల సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే రోజున ఆయన 'తెలంగాణ రాష్ట్ర సమితి' (TRS) పార్టీని స్థాపించారు. "తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యం" అని ప్రకటించిన కేసీఆర్, ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమ సత్తా నిరూపించుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నారు. తద్వారా తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకొనిపోయారు. తర్వాత ప్రభుత్వం బయటకు వచ్చారు. అప్పటి నుంచి 2014లో తెలంగాణ సాధన వరకు టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది.

వైఎస్ఆర్  పాదయాత్ర

ఉమ్మడి ఏపీలో సంక్షేమ రాజకీయాన్ని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును పూర్తిస్థాయిలో మార్చివేసిన ఘటన వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర. 2003 తీవ్ర వేసవిలో వైఎస్ఆర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,470 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి గ్రామీణ నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, ఉచిత విద్యుత్ హామీలతో ప్రజలకు నేరుగా దగ్గరయ్యారు. TRS తో పొత్తు వ్యూహం,  ఈ పాదయాత్ర ఇచ్చిన మైలేజీతో 2004 మే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో అధికారంలోకి వచ్చింది. మే 14, 2004న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్సార్, వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసి తన మార్క్ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు.

2009  హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్నే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ చిత్రాన్ని ఊహించని మలుపు తిప్పిన విషాద ఘట్టం వైఎస్ఆర్ ఆకస్మిక మరణం. 2009, సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో వైఎస్ఆర్ కోల్పోయారు. ఈ హఠాత్పరిణామం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నాయకత్వ సంక్షోభానికి దారితీసింది. తర్వాత పరిస్థితులు ఊహించని విధంగా మారాయి. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలు కావడం, వైఎస్ఆర్ కుమారుడు,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్ సీపీ స్థాపించడం, రాష్ట్ర విభజన జరగడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకొని పోవడం పరిణమాలు చోటు చేసుకున్నాయి.

2009 కేసీఆర్ ఆమరణ దీక్ష..మలిదశ తెలంగాణ మలుపు

తెలంగాణ ప్రాంత ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను జాతీయ స్థాయి అజెండాగా మార్చి, విభజన ప్రక్రియకు బాట వేసిన చారిత్రక ఘట్టం కేసీఆర్ దీక్ష. వైఎస్ఆర్ మరణంతో రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడాన్ని కేసీఆర్ దీక్ష రూపంలో తెలివిగా ఉపయోగించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్అధినేత కె. చంద్రశేఖర్ రావు 2009 నవంబర్ 29న "తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో" నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ దీక్ష విషయంలో అప్పటి ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం కూడా తెలంగాణలో భావోద్వేగాలను రెచ్చగొట్టింది. తర్వాత కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం, తెలంగాణవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగుల నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కేంద్రం దిగివచ్చింది. నాటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9, 2009న "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం" అని అధికారికంగా ప్రకటించారు. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమంలోనే అత్యంత కీలకమైన మలుపుగా చరిత్రలో నిలిచింది. అయితే ఆంధ్రా నేతలు రాజీనామాలు చేయడంతో తెలంగాణ విషయంలో తర్వాత కేంద్రం వెనక్కి తగ్గింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరింత బలపడింది. రోజు రోజుకు  ఉద్యమం ఉదృతమై ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ వచ్చే వరకు కొనసాగింది. ఈ మొత్తం చరిత్రకు కేసీఆర్ దీక్షే ప్రధాన కారణమని చెప్పొచ్చు.

2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

భారత పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా, నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఉమ్మడి ఏపీ ముగింపు ఘట్టం ఇది. సుదీర్ఘ ఉద్యమాలు, శ్రీకృష్ణ కమిటీ నివేదికల అనంతరం 2014 ఫిబ్రవరిలో లోక్‌సభ,  రాజ్యసభల్లో తీవ్ర వ్యతిరేకత, ఎంపీల నిరసనలు మరియు పెప్పర్ స్ప్రే వివాదాల మధ్య 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014' ఆమోదం పొందింది. దీని ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అధికారికంగా ఆవిర్భవించగా, మిగిలిన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ తన నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విధంగా 58 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ రాజకీయ అధ్యాయానికి అధికారిక ముగింపు లభించింది.