దానం నాగేందర్.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు. హైదరాబాద్ నగర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ.. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ చర్చ మాత్రం అప్పుడే మొదలైంది. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే.. కాంగ్రెస్ మళ్లీ దానం నాగేందర్‌కే టికెట్ ఇస్తుందా? లేక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతుందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. గతంలో జరిగిన ఓ ఆసక్తికర రాజకీయ పరిణామాన్ని ప్రస్తావిస్తూ, దానం నాగేందర్‌కు ఉప ఎన్నికల సెంటిమెంట్ కలిసిరాదనే చర్చ కూడా కొందరిలో వినిపిస్తోంది. అసలు ఆ సంఘటన ఏమిటి? వివరాలు తెలుసుకుందాం..
దానం గెలిస్తే.. పార్టీ ఓడేది! ఓడితే.. పార్టీ అధికారంలోకి వచ్చేది
దివంగత పీజేఆర్ శిష్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన దానం నాగేందర్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి చేరుకున్నారు. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన ప్రయాణంలో పార్టీలు, నియోజకవర్గాలు మారడం, గెలుపోటములు.. ఇలా ఎన్నో ఆసక్తికర మలుపులు కనిపిస్తాయి.
దానం 1989లో మొదటి సారి ఆసిఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో దానం ఓడిపోయినప్పటికీ..ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1994,1999 ఎన్నికలలో ఆసిఫ్‌నగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ రెండు సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీ అధికారంలోకి రావడం విశేషం.
2004లోకూడా ఇదే సెంటిమెంట్ పునరావృతమైంది. 2004 ఎన్నికలలో ఆసిఫ్‌నగర్ నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేశించినప్పటికీ దానం పట్టించుకోలేదు. రాత్రికి రాత్రే కండువా మార్చి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకుని ఆసిఫ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దానం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రాతినిధ్యం వహించిన టీడీపీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆయన తిరస్కరించిన సికింద్రాబాద్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్ విజయం సాధించారు.
1989 నుంచి 2004 వరకు దానం నాగేందర్ ఎన్నికల ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆయన గెలిచిన సందర్భాల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం..ఓడిపోయిన సందర్భంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ అధికారంలో రావడం అనే ఒక ఆసక్తికరమైన రాజకీయ ప్యాటర్న్గా కనిపిస్తుంది.
ఉప ఎన్నికల సెంటిమెంట్‌కు ఇక్కడే బీజం.. 2004లో ఏం జరిగింది?
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తన గురు సమానుడైన వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వంటి పరిణమాలు దానంను స్థిమితంగా ఉంచలేకపోయాయి. దాంతో దానం టీడీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడే ఉప ఎన్నికలు దానంకు కలిసి రావనే లింక్ ఓపెన్ అవుతుంది.
తన రాజీనామాతో వచ్చిన ఆసిఫ్‌నగర్ ఉప ఎన్నికలో దానం ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చి కొన్ని నెలల కావడం, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అందండలు, మంత్రులను మోహరించిన మరీ ప్రచారం చేయించిన దానం విజయం సాధించలేకపోయారు. పార్టీ, ప్రభుత్వం, అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ దానం ఓడిపోవడం అప్పట్లో చాలా మందికి విస్మయం కలిగించింది. ఎందుకంటే.. ఆసిఫ్‌నగర్ వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ దానం నాగేందర్ వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించి తనకంటూ బలమైన రాజకీయ పునాదిని ఏర్పరచుకున్నారు. అంతేకాదు.. 2004 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగి టీడీపీ కేవలం 49 సీట్లకే పరిమితమైనప్పటికీ.. టీడీపీ నుంచి గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలలో దానం ఒకరు. అంతకుముందు 1994లో టీడీపీ ప్రభంజనంతో కాంగ్రెస్ కేవలం 26 స్థానాలకే పరిమితమైన సమయంలోనూ.. ఆ పార్టీ తరఫున విజయం సాధించిన కొద్దిమంది నేతల్లో దానం నాగేందర్ ఒకరు. అలాంటి రాజకీయ పట్టున్న నేత.. అధికార పార్టీ, ప్రభుత్వం, మంత్రుల పూర్తి మద్దతు ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికలో ఓడిపోవడం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదే ఘటన ఇప్పుడు దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంలో ‘ఉప ఎన్నికల సెంటిమెంట్’ చర్చకు కారణంగా మారింది.
2004 వర్సెస్ 2024 దానంను వెంటాడుతున్న నాటి ఉప ఎన్నికల జ్ఞాపకాలు!
2004 సందర్భాన్ని ఇప్పుడు ఉప ఎన్నిక (వస్తే)తో అన్వయించి దానంకు ఉప ఎన్నికలు కలిసి రావనే భావనను కొంత మంది ముందుకు తెస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానం టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో జతకట్టడంతో పడిన అనర్హత వేటు వల్ల కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయాల్సిన ఆసక్తికరమైన పరిస్థితి.
2024 పార్లమెంట్ ఎన్నికలలో దానం కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పటికీ సొంత నియోజకవర్గంలో అధిక్యం లభించలేదు. ఇక్కడ ఆసక్తికరమైన గణంకాలు మనకు కనిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్‌కు 67,368 ఓట్లు వచ్చాయి. అంటే 43.48 శాతం ఓటు షేర్‌తో ఆయన విజయం సాధించారు. కానీ అసెంబ్లీ జరిగిన ఆరునెలల్లోనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ బరిలోకి దిగినప్పుడు.. అదే ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో దానంకు వచ్చిన ఓట్లు 57,124కు పడిపోయాయి. ఓట్ల పరంగా 10,244 తగ్గగా.. ఓటు షేర్ కూడా 43.48 శాతం నుంచి 37.94 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డికి ఖైరతాబాద్‌లో 73,664 ఓట్లు రావడంతో.. దానంపై ఏకంగా 16,540 ఓట్ల ఆధిక్యం లభించింది. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అంటే ఏకంగా 50,706 ఓట్లు తగ్గాయి.
గణంకాలను బట్టి వాటిలో మెజార్టీ బీజేపీకి పోల్ అయినట్లు తెలుస్తోంది. అంటే దానం తనతోపాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం, పార్టీ, ముఖ్యమంత్రి అండదండలు ఉన్నప్పటికీ 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌కు వచ్చిన ఓట్ల స్థాయిని.. 2024లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన కొనసాగించలేకపోయారు. ఈ గణంకాలే ఇప్పుడు దానం విషయంలో నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిస్తున్నాయి. దీంతో దానంకు ఉప ఎన్నికలు కలిసి రావు అనే వాదనను బలంగా తీసుకొస్తున్నారు. 2004తో పోల్చితే పరిస్థితులు మారిపోయాయి. నియోజకవర్గం మారింది, రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయినప్పటికీ 2004 నాటి పరిణామాలను ప్రస్తుత పరిస్థితులకు ఎంతవరకు అన్వయించవచ్చన్నది మాత్రం చర్చనీయాంశమే.
మేయర్ రేసు నుంచి మంత్రి పదవి వరకు.. ఎన్నో ట్విస్ట్‌లు!
దానం నాగేందర్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. గెలుపోటములతో పాటు ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, వివాదాలు కనిపిస్తాయి. అందులో 2002 హైదరాబాద్ మేయర్ ఎన్నిక ఒక ముఖ్యమైన ఘట్టం. అప్పట్లో మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ఎన్నిక కాగా.. ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ రెండో స్థానంలో నిలిచారు.
దానం నాగేందర్ రాజకీయ జీవితంలో మరో ఆసక్తికరమైన మలుపు 2009లో కనిపిస్తుంది. గతంలో ఆయన గెలిచిన సందర్భాల్లో.. ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం ఒక ప్యాటర్న్గా కనిపించేది. అయితే 2009లో ఆ ప్యాటర్న్ మారింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆసిఫ్‌నగర్ నియోజకవర్గం రద్దు కావడంతో.. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ప్రమాణస్వీకారం చేశారు. ఆ విధంగా తన గురు సమానుడైన వైఎస్ఆర్ క్యాబెనెట్లో మంత్రిగా ఉండాలనే ఛిరకాల కోరికను నేరవేర్చుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో కూడా మంత్రిగా పని చేశారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ దానం నాగేందర్ రాజకీయంగా చర్చలో నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని తెలిసినా.. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ వైఎస్ జగన్‌ను సీఎం క్యాంప్హౌస్లో తరచూ కలుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో.. తెలంగాణ కోసం రాజీనామా చేస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. “తెలంగాణ వాళ్లు చేస్తారు.. నేను చేయను” అంటూ ఆయన ఇచ్చిన సమాధానం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులపై స్వయంగా లాఠీ ఎత్తిన ఘటన కూడా ఆయన రాజకీయ జీవితంలో వివాదాస్పద అంశంగా మిగిలింది.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనను బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఓడించారు. ఆ తర్వాత దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన తర్వాత ఖైరతాబాద్ రాజకీయాల్లో ఆయన తిరిగి పట్టు సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగా.. 2023 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీద స్వయంగా లాఠీ ఎత్తి దానం నాగేందర్ ను పార్టీలోకి తీసుకోవడం ఒక విడ్డూరం.
దానం నాగేందర్ రాజకీయ జీవితంలో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ చుట్టూ జరిగిన రెండు పరిణామాలు మరో ఆసక్తికరమైన వైరుధ్యాన్ని చూపిస్తాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. దానం నాగేందర్ ఆ అవకాశాన్ని తిరస్కరించి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత.. 2024లో సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కోసమే బీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో కనిపించే మరో ఆసక్తికరమైన అంశం.