తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉపఎన్నిక కాకరేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు ప్రధాన పార్టీలకూ ఈ ఒక్క ఎన్నిక నిద్రలేకుండా చేస్తోంది. ఫిరాయింపుల ఆరోపణల నడుమ గెలిచి తీరాల్సిన ఒత్తిడిలో అధికార కాంగ్రెస్ ఉంటే, ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని గులాబీ దళం కంకణం కట్టుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఆధిక్యంతో ఇక్కడ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏ ఒక్క పార్టీకీ నల్లేరుపై నడకలా లేని ఈ పోరు.. ముక్కోణపు పోటీలో ముచ్చెమటలు పట్టిస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నిక పోరు తెలంగాణ రాజకీయాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ..ప్రజల మీద రుద్దిన ఉప ఎన్నిక
ఖైరతాబాద్..అందరి దృష్టి ఇదే స్థానం మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వాటికి భిన్నంగా అనైతిక చర్యల కారణంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పనిసరైంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఆ పార్టీకి రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేయించిన అనైతిక చర్య కారణంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆనాలోచిత నిర్ణయంతో ఖైరతాబాద్ ప్రజల మీద రుద్దిన ఉప ఎన్నిక ఇది.
బస్తీలే..డిసైడింగ్ ఫ్యాక్టర్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం భౌగోళికంగా, సామాజికంగా అత్యంత వైవిధ్యభరితమైన ఓటర్ల నిర్మాణాన్ని కలిగిన ప్రాంతం. సోమాజిగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఉద్యోగులు, సంపన్నులు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే చింతల్ బస్తీ, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, జహీర్ నగర్ వంటి 50కి పైగా బస్తీలు ఈ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. జనాభా పరంగా నియోజకవర్గంలో బీసీల అధిపత్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్, యాదవ్, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ వర్గాల వారు 40-45 శాతం వరకు ఉంటారు. రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ మరియు వైశ్య సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు సుమారు 25-30 శాతం వరకు ఉంటారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల శాతం దాదాపు 24. గెలుపోటముల్లో వీరిది కీలక పాత్ర. నియోజకవర్గంలో ఎస్సీ (SC) జనాభా సుమారు 8.8 శాతం, ఎస్టీ (ST) జనాభా 1.07 శాతంగా ఉంది. అంతేకాకుండా మార్వాడీలు, గుజరాతీలు, హిందీ మాట్లాడే ఉత్తరాది వారు, తమిళ/కన్నడ ప్రజలు కూడా 5 నుంచి 8 శాతం వరకు నివసిస్తారు. అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్నులు, ఉన్నత వర్గాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ అత్యల్పంగా (25–30 శాతం) నమోదవుతుంది. వాటితో పోల్చితే బస్తీల్లోనే 70 నుండి 85 శాతం వరకు పోలింగ్ జరుగుతుంది. బస్తీల్లో నమోదయ్యే ఓటింగే ఖైరతాబాద్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి చావో రేవో!
ఖైరతాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత కఠిన రాజకీయ పరీక్షగా ఈ ఉప ఎన్నిక మారబోతోంది. దానంను పార్టీలోకి తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని, అనవసరంగా ప్రజల మీద ఉప ఎన్నికను రుద్దిందని ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారింది. ఖైరతాబాద్‌లో గెలిస్తే.. దెబ్బతిన్న రాజకీయ ప్రతిష్ఠను కొంతైనా తిరిగి నిలబెట్టుకునే అవకాశం కాంగ్రెస్‌కు లభిస్తుంది. ఓటమి ఎదురైతే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ప్రతిపక్షాల పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ పోరు ఒకెత్తయితే... ఖైరతాబాద్ ఉపఎన్నిక మరొకెత్తు! ఇక్కడ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ కూడదీసుకోవాల్సిందే. ఖైరతాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఈ సారి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేస్తారనే విషయంలో కూడా చాలా చర్చ జరుగుతోంది. దానం నాగేందర్, పీజేఆర్ కూతురు విజయా రెడ్డి, రోహిణ్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే నేను బరిలో ఉంటా అని దానం ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఆయనే అయ్యే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపు అనే అంశాన్ని పక్కనపెడితే దానం బలమైన అభ్యర్ధి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాలుగు సార్లు వరుసగా పోటీ చేయడం అందులో మూడు సార్లు గెలవడంతో ఆయనకు ఈ ప్రాంతంపై గట్టి పట్టు ఉంది. దానికితోడు ఆయనకుండే నెట్వర్క్, బస్తీ ఓటర్లు, ముస్లిం ఓటర్లలో పలుకుబడి వంటివి అనుకూల అంశాలు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద దానం ఎంపీగా పోటీ చేసినప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి 11,766 ఓట్లు ఎక్కువ రావడం దానంకు ఉన్న బలాన్ని తెలియజేస్తుంది. అయితే విజయారెడ్డి ఎంత వరకు సహకరిస్తారు అనే అంశం కూడా ఇక్కడే కీలకమే. ఎమ్మెల్యేగా కావాలనే లక్ష్యంతో 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ దానం కారణంగా 2018లో ఆమెకు టికెట్ దక్కలేదు. అటుపై కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుని 2023లో దానం చేతిలో ఓడిపోయారు. ఇలా రెండు సార్లు దానం వల్ల నష్టపోయిన విజయా రెడ్డి ఎంత వరకు సహకరిస్తారు అనేది కూడా చూడాలి. పీజేఆర్ బ్రాండ్‌తోపాటు కార్పొరేటర్‌గా రెండు సార్లు ఇదే ప్రాంతం నుంచి గెలిచారు. కాబట్టి విజయా రెడ్డి ప్రభావం తప్పక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదో రకంగా విజయా రెడ్డిని సముదాయించే అవకాశాలెక్కువ.
ఇక్కడ మరో నిర్ణయాత్మక అంశం ముస్లిం ఓటర్లు. 24 శాతం వరకు వీరు ఉంటారు. దాదాపుగా వీరి ఓట్లన్నీ ఏకపక్షంగా ఒకే పార్టీ పడతాయనే వాదన ఉంది. నగరంలో ముస్లిం సామాజికవర్గాన్ని ఎంఐఎం పార్టీ అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇటీవల సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ..మా మద్దతు రేవంత్ రెడ్డికి ఉంటుందన్నారు. అంటే ఈ ఎన్నికలో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సహకరించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంలో ముస్లింలు, ఎంఐఎం కీలక పాత్ర పోషించారు. అదే పరిస్థితి ఖైరతాబాద్ లో కూడా పునరావృత్తం కావచ్చు.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసే ఆసరా పెన్షన్లు, బీసీ, ముస్లిం మహిళలకు ఇస్తున్న కుట్టుమిషన్లు, ఇందిరమ్మ ఇండ్లు వంటివి కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అంశాలు. అదే సమయంలో ఆసరా పెన్షన్ పెంచకపోవడం, మహిళలకు రూ.2500 ఇచ్చే పథకాన్ని అమలు చేయకపోవడం, హైడ్రాతో నష్టపోయిన వారు, ఉద్యోగులలో అసంతృప్తి వంటివి ప్రభుత్వానికి ప్రతికూల అంశాలు. అధికారంలో ఉండటంతో అన్ని వర్గాల మద్దతును పొందటం సులభంతోపాటు ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే సెంటిమెంట్ వంటివి వెరసి కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి కొద్దిగా అనుకూలంగా కనిపిస్తుందని పరిశీలకుల అంచనా. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడితే తప్ప విజయం సాధ్యం కాదు.
బుద్ధి చెప్పాలనే పట్టుదలతో బీఆర్ఎస్
ఖైరతాబాద్..బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఎంతో పోటీ ఉన్నప్పటికీ పార్టీలోకి చేర్చుకుని, టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. దానం నాగేందర్ తీరని ద్రోహం చేశారనే తీవ్ర ఆగ్రహంతో బీఆర్ఎస్ నాయకత్వం రగిలిపోతోంది. ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్న పార్టీకి, ఖైరతాబాద్ విజయం అత్యంత ఆవశ్యకంగా మారింది. ఇక్కడ జెండా పాతడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు దానం చేసిన నమ్మకద్రోహానికి గుణపాఠం చెప్పడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనే పట్టుదలతో బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో ఉప ఎన్నికల్లో విజయం ద్వారా తెలంగాణకు తామే ప్రత్యామ్నాయం అనే బలమైన వాదనతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రావణ్ కుమార్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే సాయికిరణ్ కు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తలసానికి ఉన్న విస్తృత పరిచయాలు, అన్ని విధాలుగా బలంగా ఉండటం, నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉండటం, ఆయన సొంత సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండటం, 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు సాయికిరణ్ కు ఈ నియోజకవర్గంలో అధిక్యం రావడం వంటివి అనుకూలించే అంశాలు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసినప్పటికీ, ఆ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే... భారీ స్థాయిలో 51,748 ఓట్లను కోల్పోయింది (2019లో సాయికిరణ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 5 వేల ఓట్లను కోల్పోయింది). ఈ నేపథ్యంలో కోల్పోయిన 51 వేల ఓట్లను తిరిగి సమీకరించుకోవడం బీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద సవాల్. ఈ సవాల్‌ను ఏ విధంగా అధిగమిస్తారనే అంశంపైనే బీఆర్ఎస్ విజయం అధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో సరైన అభ్యర్ధిని ఎంపిక చేయడం కీలకంగా మారుతుంది. సరైన అభ్యర్ధి లేకపోవడంతో 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత 2018, 2023 ఎన్నికలలో దానం అభ్యర్ధిత్వం బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రభావం చూపగల అభ్యర్థి కోసం బీఆర్ఎస్ చూస్తోంది. ఈ క్రమంలో సాయికిరణ్ బలమైన అభ్యర్ధి అని ఆ పార్టీ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రూపంలో మరో బలమైన ఆప్షన్ కూడా ఉంది. పీజేఆర్ పేరుతో ఇప్పటికీ 10–15 వేల ఓట్లు సులభంగా వస్తాయనే అంచనా ఉంది. కాబట్టి విష్ణు వైపు కూడా బీఆర్ఎస్ మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. అయితే 2009 తర్వాత ఈ నియోజకవర్గానికి విష్ణు దూరంగా ఉండటం ప్రతికూల అంశం. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం మీద సాగిస్తున్న పోరు, దానం అనైతిక చర్యలపై, దాన్ని ప్రోత్సహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న భావన, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అసంతృప్తి, కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రావాలనే ఆలోచన ప్రజల్లో ఉందనే వాదనల మధ్య కష్టపడితే విజయం సాధించవచ్చు అనే ధీమా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది.
లోక్‌సభ ఊపును కొనసాగించేనా?
ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలనే పట్టుదల ఆ పార్టీలో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఆధిక్యం దక్కింది. ఆ ఎన్నికలలో బీజేపీకి 73,664 ఓట్లు (48.92 శాతం) లభించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఇక్కడ 38,094 ఓట్లు (24.59 శాతం) మాత్రమే వచ్చాయి. అంటే అసెంబ్లీతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల్లో 35,570 ఓట్లను అదనంగా సాధించింది. అంటే 24.59 శాతంగా ఉన్న తన ఓటింగ్‌ను 48.92 శాతానికి పెంచుకుంది. ఇదే ఊపును ఉప ఎన్నికలలో కూడా కొనసాగించాలనే ఉత్సాహం బీజేపీలో కనిపిస్తుంది. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేన్ రెడ్డి, కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికలలో చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. అప్పుడు బీజేపీ-టీడీపీ పొత్తులో పోటీ చేశాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఉన్నాయి. బీజేపీకి మద్దతు విషయంలో టీడీపీ, జనసేన ఇంతవరకు ప్రకటన చేయలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఖైరతాబాద్ కూడా సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాబట్టి జూబ్లీహిల్స్ కోల్పోయిన ప్రతిష్టను ఖైరతాబాద్‌లో గెలవడం ద్వారా తిరిగి నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కిషన్ రెడ్డిలో కనిపిస్తుంది. అదే సమయంలో ఖైరతాబాద్ లో విజయంతో తెలంగాణలో వచ్చే సారి అధికారం మాదే అని ప్రచారం చేసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే సర్ విధానం ద్వారా ఓట్ల తొలగింపు, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ అనుకున్న రీతిలో అభివృద్ధి చేయలేకపోవడం వంటివి బీజేపీకి ప్రతికూల అంశాలు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఉప ఎన్నిక వస్తే అమిత్ షా వంటి అగ్రనాయకులు ప్రచారానికి రావడం సాధ్యం కాకపోవచ్చు. కొత్త ఇంచార్జీ రావడం, కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలతో ప్రజలు విసిగిపోయారనే భావన, ఫీజు రీయింబర్స్మెంట్, 22ఏ భూముల మీద సాగించిన పోరు, మోదీ మీద ఉన్న అభిమానం, కేంద్ర పథకాలు, టీడీపీ–జనసేన అంతర్గతంగానైనా మద్దతు ఇస్తాయనే ఆలోచన.. వెరసి గెలుస్తామనే అంచనా కమలనాథుల్లో ఉంది.
ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. అయితే ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగే అవకాశం ఎక్కువ. అలా కాకుండా కాంగ్రెస్-బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోరు జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటే చీలే ప్రమాదం ఉంది. అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఖైరతాబాద్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తుందని చెప్పొచ్చు.
పంచ్ లైన్
దానం నాగేందర్ చేరిక సమయంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల చేరికకు గేట్లు తెరిచాను అనే భావనలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పతనానికి గేట్లు తెరిచారు అనే వాదనను ప్రతిపక్షాలు ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.