పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనపై అధికారుల సమీక్ష 
తెలంగాణ

2.26 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం : ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై నల్లగొండ కలెక్టర్

ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం 6.09 లక్షల ఫారం-18 దరఖాస్తులు వచ్చాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, నల్లగొండ : ఖమ్మం‌‌- వరంగల్‌- నల్లగొండ‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు కోసం ఇప్పటి వరకు 6,09,357 ఫారం-18 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 2,26,380 పరిశీలించి పరిష్కరించినట్లు నల్లగొండ కలెక్టర్​, నియోజకవర్గ రిటర్నింగ్​ అధికారి బీ చంద్రశేఖర్​ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్​రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన వివరాలు వెల్లడించారు.  గత ఎన్నికల సమయంలో 5.60 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, 24 గంటల్లోనే 61,850 దరఖాస్తులు అందినట్టు వివరించారు. డేటా కరెక్షన్, డూప్లికేట్ దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ.. నిర్ణీత గడువు నవంబర్ 25లోగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించాలని ఆదేశించారు. ముసాయిదా జాబితాలను కలెక్టరేట్‌తోపాటు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. విద్యా సంస్థల్లో ఎలక్టోరల్ క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పాల్గొన్నారు.