Khelo India Athletics competitions are set to be held in December at the JNS Stadium in Hanamkonda 
తెలంగాణ

వరంగల్‌ వేదికగా.. ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌

డిసెంబర్‌లో హనుమకొండ జేఎన్‌ఎస్‌ స్టేడియంలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. ఏర్పాట్లను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి పరిశీలించారు.

Ranjith

ప్రభాత ఉదయం ప్రతినిధి, హనుమకొండ: వరంగల్‌ నగరం మరో ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. డిసెంబర్‌లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్‌) వేదికగా ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి గురువారం స్టేడియాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

క్రీడాకారులకు మెరుగైన వసతులు

పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అవసరమైన వసతులను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్‌ సూచించారు. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్‌ను ఆదేశించారు. పోటీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

స్టేడియంలో కొత్తగా నిర్మిస్తున్న మరుగుదొడ్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పోటీలు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.