మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 
తెలంగాణ

నిధులివ్వరు.. పనులు సాగవు! సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసహనం !

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు వదిలేస్తున్నారని అన్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, మునుగోడు: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నా ఆశించిన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గట్టుప్పల్‌ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పనితీరు, మునుగోడు అభివృద్ధి, మంత్రి పదవిపై గతంలో ఇచ్చిన హామీల గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో తన పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా మంత్రి పదవి ఇస్తామని, మరికొన్ని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. జనంలో మంచి పేరు తెచ్చుకుంటే శత్రువులు పెరుగుతున్నారని, తాను మంత్రి అయితే రాజకీయంగా మరింత ఎదుగుతాననే భయంతో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారనే చర్చ ఉందన్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రయత్నిస్తుంటే కొందరు వెనుక నుంచి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు.

నిధుల్లేక నిలిచిపోతున్న పనులు

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నప్పటికీ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఆరు నెలలు, ఏడాది పాటు ఎదురుచూస్తున్నారని, చివరకు పనులు వదిలేసి వెళ్లిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, జీతాలు, పింఛన్లు, రైతుబంధు చెల్లింపులకు కూడా నిధుల కొరత ఉందని వ్యాఖ్యానించారు.

మంత్రి పదవిపై హామీ ఏమైంది?

కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన సమయంలో ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. అయితే, తనకు ఎల్బీనగర్‌ వద్దని, మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మంత్రి పదవి గురించి అడిగినా మూడేళ్లు గడిచిపోయాయని వ్యాఖ్యానించారు.

తనకు పదవుల కంటే మునుగోడు అభివృద్ధే ముఖ్యమని, నిధుల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా కలిశానని చెప్పారు. మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేని పదవిలో ఉండటం కూడా దండగేనని వ్యాఖ్యానించారు.