ప్రభాత ఉదయం, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బౌన్సర్ల కంటే హీనంగా తయారయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సెక్యూరిటీ సిబ్బంది రేవంత్‌రెడ్డిని తోసేయడంతోనే మన సీఎంకు ఢిల్లీలో ఉన్న గౌరవం ఏ పాటిదో తేలిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దల ముందు తెలంగాణ నాయకులు వణుకుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా ముందు బండి సంజయ్ బౌన్సర్లా వ్యవహరించడం, తనకంటే వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్లు రాంచందర్‌రావు మొక్కే పరిస్థితి రావడం తెలంగాణ గౌరవాన్ని దిగజార్చడమేనని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సంచులు మోస్తుంటే.. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి అని, ఢిల్లీ పర్యటనలతోనే పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉత్త చేతులతో అమిత్ షా హైద్రాబాద్‌కు వచ్చి వెళ్లారని, ఒక్క ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మళ్లీ తాగునీటి, విద్యుత్ సమస్యలు వస్తున్నాయని, దీనికి కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమన్నారు.
కమీషన్ల కోసమే సీఎం చెంతకు గాంధీ
భూ దందాలు, కమీషన్ల కోసమే ఎమ్మెల్యే గాంధీ సీఎం పంచన చేరాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పగబట్టి నీటిని ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నీళ్లు అందుబాటులో ఉన్నా ప్రజలకు, రైతులకు అందించలేని దుస్థితి ఉందని, బొగ్గు అందుబాటులో ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ మహానగరానికి నిరంతరం తాగునీటి సరఫరా చేసేలా బీఆర్ఎస్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. అలాంటి ప్రాజెక్టులు, నీటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదన్నారు.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని, కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వాటి అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకుండా సీఎం బెదిరింపు వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రేవంత్ రెడ్డికి పాలనపై దృష్టి లేదన్నారు. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మియాపూర్ భూముల్లో తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, హైదరాబాద్‌లోని పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. హెచ్ఐఎల్టీ పాలసీ పేరుతో కమీషన్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన విలువైన భూములను ప్రైవేటు ప్రయోజనాల కోసం అమ్మడం దారుణమని తెలిపారు. హైదరాబాద్‌లో కేసీఆర్ సర్కారు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఇల్లయినా కట్టిందా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చడంలోనే ముందుందని విమర్శించారు. విద్యుత్ కోతలతో ప్రజలు తిరిగి జనరేటర్లు, ఇన్వర్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.