కేటీఆర్ 
తెలంగాణ

ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణపై కేటీఆర్ ఆగ్రహం

ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ తీరును కేటీఆర్ ప్రశ్నించారు. బ్యాంకు ఆస్తుల విలువ, బిడ్డింగ్ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ అంశంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు దేశ సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని శనివారం ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, రిజర్వ్ ధర కంటే బిడ్లు తక్కువగా వచ్చినప్పుడు నిబంధనలు, వాల్యుయేషన్ విధానాలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్‌లోని విలువైన భూములతోపాటు ఐడీబీఐకి ఉన్న కీలక రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను పూర్తిస్థాయిలో లెక్కలోకి తీసుకున్నారా? ’’అని నిలదీశారు. ఐడీబీఐ ఉద్యోగులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, ఆందోళనలను కేంద్రప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? దేశంలోనే మంచి పేరున్న ప్రభుత్వరంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణలో ఎందుకు అంత తొందర పడుతున్నారు. ప్రజల సంస్థలు, భవిష్యత్తు విషయంలో పారదర్శకత ఎందుకు పాటించడం లేదని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.