Rajanna Sircilla Development Works Review by Yuvraj Marmat 
తెలంగాణ

‘అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి’

అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్

Satya

ప్రభాత ఉదయం, ఆసిఫాబాద్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 335 గ్రామ సమాఖ్య భవనాలు మంజూరు కాగా 17 పూర్తయ్యాయని, 187 భవనాల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన భవనాల పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 100 జీపీ భవనాలు మంజూరు కాగా 10 చోట్ల పనులు ప్రారంభం కాలేదని, ఇందుకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పనులు ప్రారంభించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీల పనులు త్వరగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో చేయూత పింఛన్లకు 9,466 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా అర్హుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు. 8,163 స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందిరమ్మ మహిళా చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.