నీటిమట్టం తగ్గి బోసిపోయిన ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు 
తెలంగాణ

కళతప్పిన లక్నవరం.. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో అడుగంటిన నీరు.. తగ్గిన పర్యాటకుల తాకిడి!

ఎల్‌నినో ప్రభావంతో లక్నవరం సరస్సులో నీటిమట్టం సగానికి పడిపోయింది. పర్యాటకుల సందడి తగ్గడంతో పాటు రైతుల సాగునీటి కష్టాలు పెరిగాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, ములుగు : చుట్టూ దట్టమైన అడవి.. పచ్చటి కొండల మధ్య అందమైన జలాశయం.. ప్రకృతి అందాల నడుమ చూడముచ్చటగా ఉండే అద్భుతమైన సరస్సు.. ప్రకృతి మేళవించిన పర్యాటక ప్రాంతం.. ఎత్తైన కొండలు, గుట్టల మధ్య జలసిరితో సవ్వడులు.. తెలంగాణ గోవా అని ముద్దుగా పిలుచుకుంటాం.. అక్కడకు వెళ్తే చిన్న తరహా ఐలాండ్ ఫీల్ వస్తది.. అలాంటి అద్భుతమైన లక్నవరం సరస్సు ప్రస్తుతం నీరు లేక బోసిపోయింది. నీటిమట్టం సగానికి పడి పోవడంతో పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

ప్రతీ ఏడాది ఈ సమయంలో నిండుగా కనిపించే లక్నవరం సరస్సుపై ఎల్‌నినో ఎఫెక్ట్​ పడింది. ఉయ్యాల వంతెనలే కాదు కార్లు కింది నుంచి ఏకంగా మొదటి కాటేజీల వరకు వెళ్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సరస్సు ద్వారా సమీప గ్రామాలకు ప్రధాన కాలువల నుంచి సాగునీరు అందుతుంది. సరస్సులో నీళ్లు లేకపోవడంతో మొదటి పంట వేసిన చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రంగాపూర్, శ్రీరాంపతి, నర్సింహుల కోట పరిధిలోని ప్రతి ఏటా ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందేది. ఖమ్మం, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి బొగ్గులవాగు ద్వారా వరదనీరు వచ్చి చేరేది. కానీ ప్రస్తుతం ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటుతాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆశించినా నిరాశే మిగిలింది. ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అధికారులు కోరుతున్నారు.

చలికాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి విపరీతంగా ఉండేది. దసరా నుంచి సంక్రాంతి వరకు నిత్యం వేల మంది పర్యాటకులు సందర్శించేవారు. నీరు తగ్గడంతో పర్యాటకుల తాకిడి భారీగా పడిపోయింది. రోజూ వచ్చే వందల మంది టూరిస్టులు లేక రిసార్ట్‌లు బోసిపోయాయి. ఎండిపోయిన చెరువును చూసి పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. బోటింగ్ నిలిచిపోవడంతో అందమైన దీవులు కళావిహీనంగా మారాయి.