RTC Merger Protest in Asifabad 
తెలంగాణ

విలీనం హామీ ఏమైంది?

కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మిక సంఘాల ఆగ్రహం

Srinivas Rao

ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికులను నిలువునా ముంచిందని కార్మిక సంఘాల ఐక్య కూటమి నేతలు ధ్వజమెత్తారు. స్థానిక బస్సు డిపో ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన యూనియన్ ఎన్నికల ప్రచార సభలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ ప్రసంగించారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మాటను పాలకులు తుంగలో తొక్కారని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు.

 మోసపూరిత వైఖరిపై ధ్వజం

ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీన అంశాన్ని చేర్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమని నేతలు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కడం కాంగ్రెస్ నైజమని మండిపడ్డారు. శ్రమజీవుల న్యాయమైన హక్కులను కాలరాస్తున్న పాలకుల తీరును కార్మికులు గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

 కూటమిని గెలిపించాలని పిలుపు

హక్కుల సాధన దిశగా ఐక్య కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్థాయి క్లాజ్-3 విభాగంలో ఎంప్లాయీస్ యూనియన్ బస్సు గుర్తుకు, ప్రాంతీయ స్థాయి క్లాజ్-6 విభాగంలో టీఎంయూ నిచ్చెన గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తమ నాయకత్వాన్ని బలపరచి యాజమాన్యం, ప్రభుత్వ మెడలు వంచాలని వారు కోరారు.