తెలంగాణ

‘మహాలక్ష్మి’ వారికి శాపం!

- లాంగ్‌రూట్లలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కుదింపు - ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ   - గిగ్ వర్కర్ల మెడకు ‘ఎల్లోప్లేట్’

Aravind Reddy

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ‘మహాలక్ష్మి’ పథకం(Mahalakshmi Scheme)తో మహిళలు లబ్ధి పొందుతున్నా.. సాధారణ ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు రూ.10 వేలకోట్లు ఆదా చేశామని.. తెలంగాణ ఆర్టీసీకి రూ. వెయ్యికోట్ల మిగులు ఆదాయం అందించామని ప్రభుత్వం చెప్పుకొంటున్నది. కానీ మహాలక్ష్మి పథకంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. లాంగ్‌రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో తమ ఉపాధి దెబ్బతింటున్నదని ఆటోడ్రైవర్లు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆటో యూనియన్ల డిమాండ్‌కు తలొగ్గి ప్రభుత్వం తెచ్చిన ‘ఎల్లో నంబర్ ప్లేట్’  నిబంధన లక్షలాది మంది గిగ్‌వర్కర్లు, పార్ట్-టైమ్ వర్కర్లకు ఇబ్బందికరంగా మారింది.

290 కోట్ల జీరో టికెట్లు

మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద 290 కోట్లకుపైగా జీరో టికెట్లను జారీ చేసినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40 శాతం నుంచి 67 శాతానికిపైగా పెరిగిందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ సగటున 34.32 లక్షల నుంచి 35 లక్షలకుపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. బస్సుల ఆక్యుపెన్సీ 67 శాతం నుంచి 89-98 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

సాధారణ ప్రయాణికులకు ఇక్కట్లు

ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దీంతో తమకు సీట్లు లభించక అసౌకర్యం కలుగుతున్నదని సాధారణ ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న రౌటింగ్ వ్యూహాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. లాంగ్ రూట్లలో ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి వర్తించే 'ఎక్స్‌ప్రెస్' బస్సుల సంఖ్యను తగ్గించి, ఉచిత ప్రయాణ మినహాయింపులేని సూపర్ లగ్జరీ, డీలక్స్, ఏసీ సర్వీసులను పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో దూర ప్రయాణాలకు మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు సాధారణ ప్రయాణికులకు ఖర్చు పెరుగుతున్నది. 

ఆటో డ్రైవర్లపై ప్రభావం 

మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్రమైన ప్రభావం చూపించింది. తమ రోజువారీ సంపాదన 40 నుంచి 60 శాతం వరకు పడిపోయిందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల సంఘాలు గత నెలలో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని, కాంగ్రెస్ హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందించాలని, కార్మికుల భద్రత కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకోవడానికి రూ.1.50 లక్షల సబ్సిడీ సాయం అందించాలని కోరారు. చట్టవిరుద్ధంగా నడుపుతున్న ఆన్-లైన్ 'బైక్ టాక్సీ' సేవలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హామీతో ఆటో కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించారు.

గిగ్ వర్కర్ల మెడపై ‘ఎల్లోకత్తి’

ఆటో కార్మికుల సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం బైక్ టాక్సీలపై కఠిన నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా బైక్ టాక్సీలకు ఎల్లో నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలతో చాలా మంది బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ప్రస్తుతం వైట్ నంబర్ ప్లేట్లతోనే పనిచేస్తున్నారు. కాగా బైక్ టాక్సీలన్నీ తప్పనిసరిగా కమర్షియల్ ఎల్లో నంబర్ ప్లేట్ పొందాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది గిగ్ రైడర్లపై ప్రభావం చూపనున్నది. బైక్ టాక్సీలు నడిపే వారిలో 60 శాతానికి పైగా పార్ట్ టైమర్లే. ప్రైవేట్ బైక్‌ను వాణిజ్య వాహనంగా మార్చేందుకు రూ. 3వేలు అవుతుందని అంచనా. రోడ్డు ట్యాక్స్, పర్మిట్ చార్జీలు, గ్రీన్ టాక్స్, ఏటా ఫిట్‌నెస్ పరీక్షల భారం పడనున్నది. అదనపు ఆదాయం కోసం బైక్ ట్యాక్సీ నడుపుతున్న పార్ట్ టైమర్లకు ఈ ఖర్చులు భారంగా మారనున్నాయి. సొంత వాహనానికి ఎల్లో ప్లేట్ ఉంటే, కాలనీల్లో, బంధువుల వద్ద అపహాస్యానికి గురవుతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ రవాణానూ కాపాడాలి

సంక్షేమ పథకాల అమలు వేళ ఇతర అనుబంధ రవాణా వ్యవస్థలు కూలిపోకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటో యూనియన్ల ఒత్తిడికి తలొగ్గి స్వయం ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బైక్ టాక్సీ గిగ్ వర్కర్లపై భారమైన ఎల్లో ప్లేట్ నిబంధనలను బలవంతంగా రుద్దడం కూడా సమంజసం కాదని వారు ఆవేదన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు, ఆర్టీసీ మౌలిక వసతులు, గిగ్ వర్కర్ల ఉపాధి హక్కుల మధ్య సమతుల్యత సాధించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.