ప్రభాత ఉదయం, నారాయణపేట : ఆర్భాటంగా శంకుస్థాపనలు.. భారీగా నిధుల మంజూరు ప్రకటనలు.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామంటూ హామీలు.. ఇదీ మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణం విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన హడావుడి. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికుల కష్టాలు తీరడం లేదు. గుంతల రహదారిపై నిత్యం నరకయాతన తప్పడం లేదు.
రెండు సార్లు శంకుస్థాపనలు..ముందుకు పడని అడుగు
మక్తల్ నుంచి నారాయణపేట మీదుగా సింగారం చౌరస్తా వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 2025 డిసెంబరు 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.200 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జులై 18న మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి రూ.237 కోట్లతో నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారు. రెండోసారి శంకుస్థాపన జరిగి మూడు నెలలు దాటినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నిధుల మంజూరు, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, సర్వే కొనసాగుతోందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల జాడ కనిపించడం లేదు.
అడుగడుగునా గుంతలే.. ప్రమాదాల భయమే
మక్తల్–నారాయణపేట మధ్య పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల వద్ద వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉంది. మాధ్వార్ దాటాక ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో మక్తల్ నుంచి నారాయణపేటకు 40 నిమిషాల్లో చేరుకునేవారని, ప్రస్తుతం గంటకుపైగా సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. ‘‘రాత్రివేళ ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర కష్టాలు పడుతున్నారు’’ అని ఊట్కూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యవసర వేళా తప్పని అవస్థలు
ఈ మార్గంలో అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడమూ కష్టంగా మారింది. గుంతల కారణంగా అంబులెన్స్‌ల ప్రయాణం ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే రోగులను మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. రహదారి నిర్మాణం మరింత ఆలస్యమైతే అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగడమే కాకుండా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా పనులు ఎందుకు మొదలుకావడం లేదని, తమ కష్టాలు ఎప్పటికి తీరుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.