వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు
రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
ప్రభాత ఉదయం, మంచిర్యాల: సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక వివరాలను పంచుకోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన హెచ్చరించారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా, ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ‘సైబర్ జాగ్రూకత దివస్’ సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, పట్టణ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్లోడ్ తదితర పేర్లతో ఫోన్ చేసి ఎవరైనా ఓటీపీ, పిన్, పాస్వర్డ్ లేదా బ్యాంకు వివరాలు అడిగితే స్పందించవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు, లింకులు, యాప్ల విషయంలో తొందరపడకుండా “పాజ్. థింక్. వెరిఫై” విధానాన్ని పాటించాలని సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే బాధితులు 1930కు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసుల చర్యలతోపాటు ప్రజల అప్రమత్తత, సహకారం కూడా సైబర్ నేరాల నియంత్రణలో కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాశ్, సైబర్ క్రైమ్ ఏసీపీ డీవీ రంగారెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.