మీర్‌పేట్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ 
తెలంగాణ

తండ్రి వైద్య ఖర్చుల కోసం సీజ్ చేసిన నగదు, బంగారం దుర్వినియోగం

ప్రజల సొత్తుకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. పోలీసుల స్వాధీనంలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేశాడు.

Phaneendra

ప్రభాత ఉదయం, మహేశ్వరం : ప్రజల సొత్తుకు రక్షణగా ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. పోలీసుల స్వాధీనంలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేశాడు. ఓ మహిళ ఆత్మహత్య కేసులో రికవరీ చేసిన సొత్తును తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కటకటాల పాలయ్యాడు.

రూ.1.70 లక్షలు బదిలీ.. బంగారం తాకట్టు

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మహిళ బలవన్మరణం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా రూ.1.70 లక్షలను అక్రమంగా బదిలీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే, స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.12.37 లక్షలు పొందినట్లు గుర్తించారు. మొత్తంగా రూ.14.07 లక్షల విలువైన సొత్తును దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

తండ్రి చికిత్స కోసమేనని వివరణ

తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో వైద్య చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ పరిస్థితుల్లోనే ఈ చర్యలకు పాల్పడినట్లు నిందితుడు పోలీసు అధికారులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఆయన తండ్రి ఇటీవలే మరణించినట్లు తెలిసింది.

ఎలా సాధ్యమైంది?

పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తును దర్యాప్తు అధికారి సంరక్షణలో భద్రపరచాల్సి ఉంటుంది. అలాంటిది కానిస్టేబుల్ ఆ సొత్తును ఎలా దుర్వినియోగం చేయగలిగాడు? మొబైల్ ఫోన్ నుంచి నగదు బదిలీ చేయడం, బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని మీర్‌పేట్ ఎస్‌హెచ్‌ఓ శోభన్ బాబు తెలిపారు.