ప్రభాత ఉదయం, హైదరాబాద్: హైదరాబాద్‌కే పరిమితమైన క్యాన్సర్ వైద్య సేవలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ డే కేర్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడే కీమో థెరపీ సేవలు అందిస్తున్నన్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రీజనల్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులు మంత్రికి వివరించారు. ఎంఎన్‌జే, నిమ్స్‌లో ట్రీట్మెంట్ ప్రారంభించి.. కీమో థెరపీ సేవలను జిల్లాల్లో అందిస్తున్నామని అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా రోగులను మ్యాపింగ్ చేస్తున్నట్లు వివరించారు. జనవరి నాటికి 4 కొత్త మొబైల్ స్క్రీనింగ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని రాజనర్సింహ పేర్కొన్నారు.
ప్రభుత్వ చర్యలపై సంతృప్తి..
క్యాన్సర్ ప్రివెన్షన్, స్క్రీనింగ్, చికిత్స విషయంలో తెలంగాణ ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా గుర్తించడం, కేన్సర్ రిజిస్ట్రీ, కేన్సర్ పోర్టల్‌ను ప్రారంభించడం వంటి చర్యలు క్యాన్సర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసి కీమో థెరపీ సెంటర్లు జిల్లాల్లోనే అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ పేషెంట్ల కోసం మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, రొబోటిక్ సర్జరీలు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని దత్తాత్రేయుడు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు కొండిబా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ డైరెక్టర్ నరేంద్రకుమార్, డీఎంఈ వాణి, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ సదాశివుడు, నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.