ప్రభాత ఉదయం, వనపర్తి : నీళ్ల విషయంలో బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరుకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తన రాజకీయాల కోసం ప్రకృతి వైపరీత్యాలను వాడుకుంటోందని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవల వనపర్తిలో పర్యటించారని, ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిష్ఠ పెంచేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి జూరాల ప్రాజెక్టులో ఉన్నది 10టీఎంసీలేనని హరీశ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. జూరాల నుంచి రామన్ పాడుకు పార్లల్ కాలువ తప్పుగా నిర్మించారని అప్పట్లోనే హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఈ కాలువను అప్పుడే సరిచేసి ఉంటే పాలమూరుకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న గూడెం దొడ్డి రిజర్వాయర్‌ను గత ప్రభుత్వ హయంలోనే పూర్తి చేసి ఉంటే వేల ఎకరాలు సాగులోకి వచ్చేవన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరో మూడు నెలల దాకా ఏదుల రిజర్వాయర్‌కు నీరు ఇవ్వలేమన్నారు.
అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి అబద్ధాలతోప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జూపల్లి విమర్శించారు. 2012 నుంచి కల్వకుర్తిలో 5 మోటర్లు ఉన్నాయని, మరి అప్పుడే ఎందుకు స్టార్ట్ చేసి నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో మోటర్లు మునిగిన విషయం మీకు తెలియదా..? నార్లపూర్ నుంచి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి 90శాతం కంప్లీట్ అయిందని హరీశ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.60 వేల కోట్లు అంచనాతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్ల ఖర్చు పెడితే ఎలా పూర్తవుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే మరో రూ.80వేల కోట్లు ఖర్చవుతుందని మంత్రి చెప్పారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రా లీడర్లకు తొత్తులుగా మారి నీటిని అప్పగించారు. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు నీటిని అప్పగిస్తున్నారని చెప్పడం దారుణం’ అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరువు మండలాలను గుర్తించామని, కరువు నివారణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.