ప్రభాత ఉదయం, కొల్లాపూర్ : మహిళలు అక్షరాస్యులైనప్పుడే ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళలు విద్యావంతులైతేనే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం తెల్లరాళ్లపల్లిలోని నిరక్షరాస్య మహిళలు చదువు నేర్చుకునేందుకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చదువు నేర్పించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్ జంబులయ్యకు సూచించారు. మహిళలంతా అక్షరాస్యులుగా మారేంత వరకూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపారు. ఇందుకోసం మంత్రి తన వంతుగా రూ.20 వేలు అందించారు. ముందుగా చదువు నేర్చుకున్న మహిళకు రూ.5 వేల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.