తెలంగాణ

వరద నష్టాలపై సమగ్ర నివేదికలివ్వండి : పొంగులేటి

మురసు తుఫాన్ వరద నష్టాలపై 2-3 రోజుల్లో సమగ్ర నివేదికలివ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాలను అంచనా వేయాలని సూచించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, సత్తుపల్లి : వరద నష్టాలపై 2-3 రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నష్టాలను అంచనా వేయాలని సూచించారు. మురసు తుఫాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఉన్నతాధికారులతో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలతోపాటు సత్తుపల్లి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించారు. వరదల్లో చిక్కుకున్న మత్స్యకారులు, ఇతర బాధితులను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమయస్ఫూర్తితో రక్షించి.. ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా చూశారని అభినందించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్‌ను బలోపేతం చేసి, 1,900 మంది సిబ్బందికి శిక్షణతోపాటు సుమారు రూ.260–270 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను సమకూర్చిందని తెలిపారు. వరదల కారణంగా పలు చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు గండ్లు పడటంతోపాటు పంటలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు వెల్లడించారు. రెండు జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, తాగునీటి శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో గత 36 గంటలుగా నిరంతరం శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో సొంత ఇండ్లు లేని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు త్వరితగతిన సహాయం అందించడంతోపాటు దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్యే, కలెక్టర్ సమన్వయం అభినందనీయం

బేతుపల్లి చెరువులో ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో 16 మందిని సురక్షితంగా కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది చేసిన సాహసోపేత సేవలు అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి బేతుపల్లి చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి సహాయక చర్యలు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ.. అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేశారని అభినందించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, రెస్క్యూ బృందాలకు అవసరమైన సహకారం అందించారని ప్రశంసించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో బాధితులను గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రెస్క్యూ సిబ్బంది చూపిన ధైర్యం, అంకితభావం ప్రశంసనీయమని, వారివల్లే 16 మంది ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ పోరాటం అద్భుతం: మంత్రి తుమ్మల

బేతుపల్లి చెరువులో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న మత్స్యకారులతోపాటు ప్రమాద సమయంలో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం సురక్షితంగా రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది చూపిన తెగువ, పోరాట పటిమ అద్భుతమని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ప్రశంసించారు. సత్తుపల్లి పట్టణంలోని అటవీ శాఖ అతిథి గృహంలో రెస్క్యూ బృందాల సిబ్బందిని సన్మానించి, అభినందించారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డ జాలర్లు కూడా మంత్రిని సన్మానించారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..‘‘మీ పోరాట పటిమతో జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంచారు. మీ రుణం జీవితాంతం తీర్చుకోలేనిది” అని సిబ్బందిని ఉద్దేశించి భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ప్రజల తరఫున ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదం జరిగినప్పటినుంచి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసిన జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.