మంత్రి సీతక్క  
తెలంగాణ

ఉపాధి పనుల్లో చెంచులే ఎక్కువ : మంత్రి సీతక్క

చెంచు కుటుంబాల వలసలకు చెక్ పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : చెంచు గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని, దీంతో వలసలు తగ్గుముఖం పట్టాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాకు వీడియో సందేశం పంపించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే చెంచు గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య అధికంగా ఉందన్నారు. అంతటా గ్రామానికి సగటున 39 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తుండగా, నాగర్ కర్నూల్ జిల్లాలోని పద్రా మండలంలో గ్రామానికి 94 మంది, బ‌ల్మూరులో 46 మంది, పెద్దకొత్తపల్లిలో 45 మంది, అమ్రాబాద్‌లో 42 మంది, కొల్లాపూర్‌లో 39 మంది, అచ్చంపేటలో 37 మంది, లింగాలలో 31 మంది కూలీలు పనులకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. చెంచు గ్రామాల్లో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం మేట్లను నియమించి, ఉపాధి పనుల గుర్తింపు, కూలీల సమీకరణ చేపట్టాలని సూచించారు. ఏడాది పొడవునా ఉపాధి ఉండేలా చూస్తామన్నారు. వీబీజీ రామ్ జీ పథకం కింద 125 రోజుల ఉపాధితో పాటు జలసిరి కార్యక్రమంతో నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ వంటి పనుల్లోనూ పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చెంచు కుటుంబాల వలసల నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమ‌ని స్పష్టం చేశారు.