ప్రభాత ఉదయం, ములుగు : బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ గొప్ప సంప్రదాయాన్ని కాపాడుకుంటూ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఆటపాటలు, చెరువులతో బతుకమ్మకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. పూలను పూజించే పండుగగా, వాటి ద్వారా చెరువులను కొలిచి, శుద్ధి చేసుకునే సంప్రదాయంగా బతుకమ్మకు ప్రత్యేకత ఉందని వివరించారు. ఆడబిడ్డలు అమ్మగారింటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే ఈ తొమ్మిది రోజుల పండుగ తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని సూచించారు.
ప్రతి ఆడబిడ్డ సమాజంలో గౌరమ్మలా వర్ధిల్లాలని, శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన అని సీతక్క తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, ఐసీడీఎస్ సీడీపీవో శిరీష, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కౌన్సిలర్లు స్వాతి, పావని, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.