ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, తయారీ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన పరిశ్రమ ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్తు సవాళ్లను అవకాశాలుగా మలుచుకునేలా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
2025-26లో తెలంగాణ తయారీ రంగం 7.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో తయారీ రంగం వాటా రూ.1.37 లక్షల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వివరించారు.
చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తిలోనూ తెలంగాణను ముందంజలో నిలపడమే లక్ష్యమన్నారు. పరిశోధన, ఉత్పత్తి రూపకల్పన నుంచి విడిభాగాలు, తుది ఉత్పత్తుల తయారీ వరకు అన్ని కార్యకలాపాలు రాష్ట్రంలోనే జరిగేలా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.