ప్రభాత ఉదయం, అశ్వారావుపేట : మురసు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట మండలంలోని అంకమ్మ చెరువుకు పడిన గండిని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి మాట్లాడారు. చెరువుకు గండి పడి దిగువన ఉన్న పొలాలు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. భారీ వరదలతో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లిందని చెప్పారు. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టం వివరాలతో శుక్రవారం సాయంత్రంలోగా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టం వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు సాయం అందిస్తామని తెలిపారు. రహదారుల పునరుద్ధరణ, దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంఎల్ఏ ఆదినారాయణ, అశ్వారావుపేట మున్సిపల్ చైర్పర్సన్ జూపల్లి రమేశ్ ఉన్నారు.