సూర్యాపేటలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  
తెలంగాణ

2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ శకమే: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనతో ప్రజల్లో మద్దతు పెరుగుతోందని, 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పాలనే కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Phaneendra

ప్రభాత ఉదయం, సూర్యాపేట: తెలంగాణలో 2024లో మొదలైన కాంగ్రెస్‌ శకం 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర ఇరిగేషన్​, సివిల్​ సప్లయ్​ శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయని, వాటి ఫలితంగా కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందని చెప్పారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్​ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం సంక్షేమ కార్యక్రమాల్లో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆందోళనలు, సాగునీటి సవాళ్ల మధ్య కూడా రాష్ట్రంలో గణనీయమైన వరి ఉత్పత్తి నమోదైందని తెలిపారు. ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సంస్థాగత బలాన్ని చాటేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి పట్టభద్రులు మద్దతునిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నల్లగొండ, భువనగిరి ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, తదితరులు పాల్గొన్నారు.

వేణారెడ్డి అభిమానుల ఆందోళన

సూర్యాపేట కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఫ్లెక్సీ వివాదం రచ్చకెక్కింది. స్థానిక మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫొటో ఫ్లెక్సీలో పెట్టలేదంటూ ఆయన అభిమానులు మంత్రి సమక్షంలోనే ఆందోళనకు దిగారు. దీంతో మీటింగ్​లో కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్లెక్సీలో వేణారెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదంటూ నిర్వాహకులను నిలదీశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ పరిణామంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ చేసేవాళ్లు సమావేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.