నారాయణపేటలో ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి 
తెలంగాణ

ఓటును కాపాడితేనే రాజ్యాంగ రక్షణ.. మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేటలో జరిగిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి ఓటుహక్కు పరిరక్షణపై మాట్లాడారు.

Suryanarayana

ప్రభాత ఉదయం, నారాయణపేట: పేదోడి ఓటును కాపాడుకోవడం ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో అర్హుల ఓట్లను తొలగించడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. నారాయణపేటలో సోమవారం నిర్వహించిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చాలా విలువైనదని, దానిని హరించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. నవంబరు ఒకటో తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

పాలమూరు–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించడానికి పార్టీ శ్రేణులు కృషిచేయాలని కోరారు. పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించి, పార్టీ విజయానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు రవీంద్రదాస్‌, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.