మంత్రి వాకిటి శ్రీహరి  
తెలంగాణ

మత్స్యకారుల సంక్షేమానికి సహకరించాలి: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో మత్స్య రంగ అభివృద్ధికి, మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా సహకారం అందించాలని మంత్రి వాకిటి శ్రీహరి కేంద్రాన్ని కోరారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్​ : రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. మత్స్యకారుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా మరింత సహకారం అందించాలన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు పాలక మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. చేపల ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరి, కృష్ణా నదులతో పాటు రిజర్వాయర్లు, చెరువులు, ఇతర జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటే చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చని పేర్కొన్నారు.తెలంగాణ చేపల ఎగుమతులకు వసతులు కల్పించాలితెలంగాణలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇతర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఎన్ఎఫ్​డీబీని మంత్రి కోరారు. ఇందుకోసం కోల్డ్ స్టోరేజీలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక రవాణా సదుపాయాలు, ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎల్‌నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్య రంగంపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధి, ఆదాయం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్​కు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి వాకిటి వివరించారు.