రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి
అర్హులైన పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు
ప్రభాత ఉదయం, మంచిర్యాల: ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని మంత్రి గడ్డం వివేక్ కోరారు. మందమర్రి మండలం వెంకటాపూర్లో 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అధికారులతో కలిసి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
32 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.3 కోట్లతో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామన్నారు. భూమి కేటాయింపుపై ఉన్న అభ్యంతరాలను గ్రామస్థులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. వెంకటాపూర్లో 32 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామానికి 38 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లతో 2,500 మంది విద్యార్థులకు వసతులతో కూడిన ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలనీ నుంచి ఆర్కె-5 వరకు 4.7 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.85 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో అవసరమైన ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి ఆ దేశంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం 70 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం మందమర్రి మున్సిపాలిటీ 14వ వార్డులో యూఐడీఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 24 వార్డులకు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. త్వరలో మరో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నస్పూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంకటాపూర్ గ్రామస్థులకు సంతాపంగా రెండు నిమిషాలు మంత్రి మౌనం పాటించారు.