ప్రభాత ఉదయం, ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్ తుమ్మెద గ్రామంలోని చెన్నకేశ్వర స్వామి గుట్టపై చిరుతపులి సంచరించడంతో స్థానికంగా కలకలం రేపింది. గుట్ట దిగువన రైతులు వరి ధాన్యం నూర్పిడి పనులు చేస్తుండగా, ఆలయ గర్భగుడి సమీపంలో చిరుత కనిపించిందని, ఇది గమనించిన వారు అప్రమత్తమయ్యారు. సర్పంచ్ సాయిలు, గ్రామస్తులు అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇటీవల మెదక్–ఎల్లారెడ్డి జాతీయ రహదారిని దాటి వచ్చినట్లు భావించారు. చిరుత రెండు రోజుల క్రితం వెంకంపల్లి గుట్టపై కనిపించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మాల్ తుమ్మెద గుట్టపై సంచరిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సమాచారం అందుకున్న వీఆర్వో రాఘవేందర్, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. సుమారు రెండు గంటల పాటు చిరుత కదలికలను గమనించినట్లు తెలిసింది. సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు బయటకు వెళ్లొద్దని, అత్యవసర పనుల కోసం వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ వాసుదేవ్ స్పందిస్తూ, చిరుతను బంధించేందుకు జిల్లా అధికారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత బోను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.