ప్రభాత ఉదయం, ములుగు : కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో ఇంటిపన్నుల వ్యవహారం గందరగోళంగా మారింది. అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని, భువన్ సర్వే పేరుతో కొలతలు తీసుకొని ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, హౌస్ హోల్డర్స్ ఆరోపిస్తున్నారు. ఈమేరకు శనివారం అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడించారు. మున్సిపాలిటీ పరిధిలో అడ్డగోలుగా పన్నులు పెంచడంతో చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిలపక్ష నేతలు అధికారులపై మండిపడ్డారు. స్క్వేర్ ఫీట్ కు రూ.0.20పైసల నుంచి రూ.1.75కి పెంచామని కాగితాల్లో చూపుతున్న ఆఫీసర్లు.. వందల రూపాయల్లో ఉన్న పన్నులను వేల రూపాయలకు, వేలల్లోవి లక్షల్లోకి పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. పన్నుల పెంపు చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ సంపత్ అందుబాటులో లేకపోవడంతో టీపీవో కిరణ్, మేనేజర్ రాజేందర్‌తో అఖిలపక్ష నాయకులు మాట్లాడి, ట్యాక్స్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. మున్సిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు, కమిషనర్ కార్యాలయంలో కూర్చొని ఇష్టానుసారంగా పన్నులు, ఇండ్ల అనుమతుల పేరుతో లక్షల్లో వసూలు చేస్తూ సామాన్యులపై పెనుభారం మోపుతూ అభివృద్ధి మరిచిపోతున్నారని ఆరోపించారు. సాధారణంగా రూ.100 వసూలు చేసే పన్నును రూ.150 చేస్తే భరిస్తామని.. కానీ, ఏకంగా రూ.1000 చేయడం దోపిడే అవుతుందన్నారు. వెంటనే సామాన్యులపై మోపిన అధిక పన్నులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, మున్సిపల్ కమిషనర్ సోమవారం కార్యాలయంలో అందుబాటులో ఉంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది వ్యాపారులు, ఇంటి ఓనర్లు పాల్గొన్నారు.