-ఇసుక లారీల డ్రైవర్లు నిబంధనలు పాటించాలి
-రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి
-ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ప్రభాత ఉదయం, ఏటూరునాగారం: వాహనాలు వేగపరిమితి దాటితే సీజ్ చేస్తామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో శుక్రవారం ఆయన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇకపై నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. నిత్యం లారీ డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇసుక లారీల కారణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై టీజీఎండీసీ ఉన్నతాధికారితో చర్చించారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, అదనపు ఎస్పీ సదానందం, ములుగు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, స్థానిక సీఐలు, ఆర్ఎస్సైలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.