ప్రభాత ఉదయం, నకిరేకల్ : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ సమీపంలోని అన్నారం స్టేజ్ వద్ద జాతీయ రహదారి 65పై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 2.20 గంటలకు లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గార్లపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వాసు (22), నోముల బీసీ కాలనీకి చెందిన గోగుల స్వాతి (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ నడుపుతున్న జొన్నలగడ్డ ప్రశాంత్ (21) గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎన్కేఎల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.