ప్రభాత ఉదయం, నాగార్జున సాగర్ : ఒకప్పుడు బత్తాయి సాగులో నల్లగొండ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో ఇప్పుడు బత్తాయి తోటలు కనుమరుగవుతున్నాయి. వేరు కుళ్లు, మంగు తెగుళ్లు, రకరకాల చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు, మార్కెటింగ్ సమస్యలతో రైతులు సాగుకు దూరమవుతున్నారు. ఒకప్పుడు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో బత్తాయి సాగయ్యేది. ప్రస్తుతం సుమారు 40 వేల ఎకరాలకు పడిపోయింది. పెద్దవూర, గుర్రంపోడు, అనుముల, తిప్పర్తి, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు తదితర మండలాల్లో బత్తాయి ప్రధాన పంటగా ఉండేది. వరి తర్వాత అత్యధికంగా రైతులు బత్తాయి తోటలపైనే ఆధారపడేవారు.
తెగుళ్లు.. పెట్టుబడి భారం
చీడపీడలు తోటలను దెబ్బతీశాయి. వాటి నివారణకు అధికంగా ఖర్చుచేయాల్సి రావడంతో రైతులకు పెట్టుబడి భారం పెరిగింది. దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ‘‘వేరు కుళ్లు, మంగు తెగుళ్ల వల్ల బత్తాయి సాగులో తీవ్ర నష్టం వాటిల్లింది. నేను ఒకప్పుడు 5 ఎకరాల్లో సాగు చేశాను ప్రస్తుతం పూర్తిగా తొలగించాను. లక్షలు ఖర్చుచేసినా గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలయ్యాం. సాగునీటి సమస్యలు, మార్కెటింగ్ సౌకర్యాల లేమి కూడా మరో కారణం’’ అని గుర్రంపోడు గ్రామానికి చెందిన రైతు వద్దిరెడ్డి సురేశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బత్తాయి సాగులో ప్రధానంగా వేరుకుళ్లు, మంగు నల్లి లాంటి వివిధ రకాల చీడపీడలు పెరిగాయి. దీంతో గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు’’ అని హార్టికల్చర్ అధికారి మురళి అన్నారు.
భూగర్భ జలాలు తగ్గి ..
ఈ ఏడాది సరైన వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో చాలా మండలాలలో బోరు బావుల్లో నీళ్లు తగ్గిపోయాయి. దీంతో తోటలు ఎండిపోతున్నాయి. ‘‘లక్షలు పెట్టుబడి పెట్టి 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న బత్తాయి చెట్లు కళ్ల ముందే ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి డబ్బులు రాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాం’’ అని రైతులు వాపోతున్నారు.
జ్యూస్ ఫ్యాక్టరీ కోసం ఎదురుచూపులు
జిల్లాలో లక్షల టన్నుల బత్తాయి దిగుబడులు వస్తున్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. జిల్లాలో బత్తాయి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా నేటికీ నెరవేరలేదు. ‘‘బత్తాయి రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రత్యామ్నాయ మార్కెట్ లభించి ఆర్థిక భరోసా కలుగుతుంది. ప్రభుత్వం సబ్సిడీలను అందించి ప్రోత్సహించాలి.’’ అని గుర్రంపొడు మండలం వద్దిరెడ్డిగూడెం రైతు కమతం వెంకటరెడ్డి కోరారు.