Narmeta oil palm factory 
తెలంగాణ

ఆయిల్ పామ్​ రైతులకు ‘నర్మెట’ ఆదరువు

30 జిల్లాల నుంచి పంట రాక

B. Suresh

ప్రభాత ఉదయం, సిద్దిపేట: ఎన్నో వ్యయప్రయాసలతో పండించిన పంటను విక్రయించి.. సొమ్ము చేసుకోవడం రైతులకు గగనంగా మారింది. దళారుల బెడద, రవాణా సమస్య, గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు నిత్యం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ఆయిల్ పామ్​ రైతులకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఏర్పాటు చేసిన పరిశ్రమ ఎంతో ఉపయుక్తంగా మారింది.

గత మార్చి 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పామాయిల్ పరిశ్రమను ప్రారంభించారు. రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి రైతులు తాము పండించిన పంటను క్రషింగ్ కోసం పరిశ్రమకు తరలిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 600 మెట్రిక్ టన్నులు క్రషింగ్ చేస్తున్నారు. ప్రారంభించిన ఆరు నెలలలోనే రికార్డు స్థాయిలో 74.847 మెట్రిక్ టన్నులు క్రషింగ్ చేసి 13 వేల లీటర్ల  ముడి చమురును ఉత్పత్తి చేశారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి వినియోగించేలా చర్యలు చేపట్టారు. 

మూడు రోజుల్లో నే చెల్లింపులు

రైతులకు మూడు రోజుల వ్యవధిలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. టీజీ ఆయిల్ ఫెడ్ ధర నిర్ణయించిన ప్రకారం ఇప్పటి వరకు 9,560 మంది రైతులకు సొమ్ము చెల్లించారు. ‘‘ రైతుల నుంచి ఆయిల్ పామ్ ​గెలలను కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే వారి ఖాతాలకు ఆన్‌లైన్లో చెల్లిస్తున్నాం. నవంబర్ వరకు క్రషింగ్ సీజన్ ఉండటంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.’’ అని ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఆరు నెలల్లో  ధర  పెరుగుదల

ఆరు నెలల క్రితం నర్మెటలో ఫ్యాక్టరీ ప్రారంభించగా టన్ను గెలల ధర రూ.21,546 ఉండేది. ప్రస్తుతం రూ.23,641కు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెండు ఫ్యాక్టరీలున్నా రాష్ట్రం మొత్తానికి సేవలందించే పరిస్థితి లేకపోవడంతో నర్మెట కీలకంగా మారింది. పదివేల ఎకరాల ఆయిల్ పామ్​ తోటలున్న జిల్లాలో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 11 ఫ్యాక్టరీలు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నిర్మాణంలో ఉన్నాయి.